LOADING...
DCGI: డెంగీ నియంత్రణలో కీలక ముందడుగు.. దేశంలో తొలి టీకాకు గ్రీన్ సిగ్నల్
డెంగీ నియంత్రణలో కీలక ముందడుగు.. దేశంలో తొలి టీకాకు గ్రీన్ సిగ్నల్

DCGI: డెంగీ నియంత్రణలో కీలక ముందడుగు.. దేశంలో తొలి టీకాకు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న డెంగీ వ్యాధి నియంత్రణలో భారత్ కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి డెంగీ వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందిన 'క్యూడెంగా' (TAK-003)కు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) పరిధిలోని సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC) ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలపడంతో, త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ 'తకేడా' ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. డెంగీకి కారణమయ్యే నాలుగు రకాల వైరస్‌లపై (DENV-1 నుంచి DENV-4 వరకు) ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు

మూడు నెలల వ్యవధిలో రెండు డోసులు

4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఈ టీకాను తీసుకోవచ్చు. మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా దీన్ని ఇవ్వనున్నారు. ఇప్పటికే డెంగీ బారినపడినవారు గానీ, ఎప్పుడూ సోకని వారు గానీ ఎలాంటి ముందస్తు పరీక్షలు అవసరం లేకుండానే ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ సంస్థలో తయారు చేయనున్నారు. ఇందుకోసం తకేడా సంస్థతో ఒప్పందం కుదిరింది.

వివరాలు

ఏటా 2.3 లక్షలకు పైగా కేసులు

2030 నాటికి ప్రతి సంవత్సరం 5 కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశీయంగా తయారీ జరగడం వల్ల టీకా ధర తగ్గి, సాధారణ ప్రజలకు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్‌లో డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2023, 2024 సంవత్సరాల్లో ఏటా 2.3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో 'క్యూడెంగా' వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ప్రజలకు భారీ ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.

Advertisement