Polavaram: పోలవరం డ్యాం పనుల్లో కీలక ముందడుగు.. గ్యాప్-2 నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-2 ప్రధాన డ్యాం జి కొండను కలిసే ప్రాంతంలో 300 మీటర్ల మేర చేపట్టనున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఆకృతులకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్న విదేశీ నిపుణుల బృంద సభ్యుడు హించ్‌బెర్గర్ గురువారం రెండో రోజు కూడా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రధాన డ్యాం గ్యాప్-2లోని కొంత భాగాన్ని ఆయన ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే నిర్మాణ ఆకృతులపై సుదీర్ఘ చర్చ జరిగింది. 300 మీటర్ల మేర నిర్మాణాన్ని ఎలాంటి డిజైన్‌లతో చేపట్టబోతున్నారో పోలవరం అధికారులు, అఫ్రి డిజైన్ సంస్థ ప్రతినిధులు హించ్‌బెర్గర్‌కు వివరించారు.
వివరాలు
నిర్మాణ ఆకృతులకు సంబంధించిన నమూనాల పరిశీలన
అదేవిధంగా అక్కడి ప్రొఫైల్ డేటాను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ఆకృతులకు సంబంధించిన నమూనాలను అధికారులు ఆయనకు సమర్పించగా, వాటికి హించ్‌బెర్గర్ సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. ఇక ప్రధాన డ్యాం నిర్మాణంలో నాణ్యత నియంత్రణ కోసం నిర్వహిస్తున్న పరీక్షలు, వాటి ఫలితాలపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. డ్యాంలో వివిధ సాంకేతిక అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసే ఇన్‌స్ట్రుమెంటేషన్ వ్యవస్థపై కూడా చర్చ జరిగింది. గతంలో ఈ ఇన్‌స్ట్రుమెంటేషన్ పరికరాలు ఎక్కువగా ఏర్పాటు చేసినట్లు విదేశీ నిపుణులు పేర్కొన్నారని అధికారులు తెలిపారు.
వివరాలు
డయాఫ్రం వాల్ నిర్మాణంపై చర్చ
ప్రస్తుతం మళ్లీ ఏయే పరికరాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘానికి సమర్పించిన వివరాలపై సమావేశంలో చర్చించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చ కొనసాగింది. గతంలో విదేశీ నిపుణుల బృందం చేసిన సిఫార్సులు, వాటి అమలు పురోగతిపై సమీక్షించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమర్పించినట్లు ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి వెల్లడించారు. ఈ సమావేశంలో పోలవరం అథారిటీ సీఈవో సంజీవ్ ఓహ్రా, సభ్య కార్యదర్శి రఘురామ్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, పోలవరం అథారిటీ చీఫ్ ఇంజినీర్ రమేష్‌కుమార్, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్ భక్షి, ఎస్‌ఈ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.