Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.. డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముంబైలోని లోక్‌భవన్‌లో ఆమె డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు అజిత్ పవార్ మృతి చెందడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ పగ్గాలు ఎవరు చేపడతారు? డిప్యూటీ సీఎం పదవిని ఎవరు భర్తీ చేస్తారు? అలాగే ఎన్సీపీ-ఎన్సీపీ (శరద్ పవార్) వర్గాలు మళ్లీ కలిసే అవకాశముందా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ సందేహాలన్నిటికీ సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా నియామకంతో తెరపడినట్లయింది.
Details
90శాతం మంది అంగీకారం
అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలైన సునేత్ర పవార్‌ను డిప్యూటీ సీఎంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో స్పష్టత వచ్చింది. ఎన్డీఏ కూటమి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని అధికారికంగా వెల్లడించింది. ఎన్సీపీ ఎమ్మెల్యేలలో దాదాపు 90 శాతం మంది సునేత్ర పవార్‌ను తమ నాయకురాలిగా అంగీకరించడంతో ఆమె ఉప ముఖ్యమంత్రి పదవికి మార్గం సుగమమైంది. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన అనంతరం, ఎన్సీపీ అజిత్ వర్గం ప్రతిపాదన మేరకు డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించేందుకు సునేత్ర పవార్ అంగీకరించినట్లు సమాచారం.
Details
ఆర్థిక శాఖను తొలగించే అవకాశం
అయితే ఆమె డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటే ఆరు నెలలలోపు బారామతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాల్సి ఉంటుంది. శాఖల కేటాయింపుల విషయానికి వస్తే, దివంగత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఎక్సైజ్, క్రీడలు, ఆర్థిక శాఖలను పర్యవేక్షించారు. సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్సైజ్, క్రీడా శాఖలు ఆమె వద్దనే కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఆర్థిక శాఖను ఆమె నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ శాఖను తన వద్దే ఉంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.