Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అస్ఫాన్ అనే యువకుడు ఉద్యోగం కోసం రష్యా వెళ్లి మోసపోయాడు. అక్కడ రష్యా సైన్యంలో చేరాడు. రష్యా తరఫున ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అతడు చనిపోయినట్లు మాస్కోలోని భారత రాయబార కేంద్రం వెల్లడించింది. మహ్మద్ అస్ఫాన్‌ను రష్యా నుంచి తీసుకురావడానికి సాయం చేయాల్సిందిగా ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అతడి కుటుంబం సంప్రదించింది. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా.. అతడు చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. మహ్మద్ అస్ఫాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆన్‌లైన్ ప్రకటన ద్వారా మోసం
మహ్మద్ అస్ఫాన్‌తో పాటు మరికొందరు నకిలీ ఏజెంట్ల ఆన్‌లైన్ ప్రకటన ద్వారా రష్యాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని మోసపోయారు. నకిలీ ప్రకటన ద్వారా విదేశాల్లో యువకులను రష్యాకు వచ్చేలా చేస్తున్నారు. ఆ తర్వాత వారిని ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యన్ సైన్యానికి 'సహాయకులు'గా నియమిస్తున్నారు. మహ్మద్ అస్ఫాన్ మాదిరిగానే, రష్యా సైన్యానికి 'సహాయకుడిగా' పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన 23 ఏళ్ల భారతీయ వ్యక్తి ఇటీవల రష్యాలో మరణించారు. సూరత్‌కు చెందిన హమీల్ మంగూకియా ఆన్‌లైన్ ప్రకటన చూసి రష్యాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని మోసపోయాడు. ఆ తర్వాత అతను రష్యన్ సైన్యంలో సహాయకుడిగా నియమించబడ్డాడు. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెట్స్క్ ప్రాంతంలో ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ జరిపిన వైమానిక దాడిలో మంగూకియా మరణించాడు.