PM Modi: దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం.. మోదీ సరికొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
తన రాజకీయ ప్రస్థానంలో నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలాన్ని కలుపుకుని, మొత్తం 8,931 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా ప్రభుత్వ అధిపతిగా కొనసాగిన నేతగా ఆయన కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. సిక్కిం ముఖ్యమంత్రిగా ఆయన 8,930 రోజులు పదవిలో కొనసాగారు. తాజాగా మోదీ ఈ రికార్డును అధిగమించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, 2014వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, అప్పటి నుంచి నిరంతరం ఆ పదవిలో కొనసాగుతున్నారు. గుజరాత్ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కూడా మోదీ నిలిచారు.
Details
జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేసిన మోదీ
అలాగే ముఖ్యమంత్రిగా అత్యధిక అనుభవం కలిగిన ప్రధానిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. స్వాతంత్ర్యం అనంతరం జన్మించి, కాంగ్రెసేతర పార్టీ నుంచి దీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన తొలి నాయకుడు కూడా మోదీయే. కేంద్రంలో రెండు పూర్తి పదవీకాలాలను విజయవంతంగా పూర్తిచేసుకుని, మూడోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర నేతగా ఆయన మరో రికార్డు సృష్టించారు. వరుసగా 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీని విజయపథంలో నడిపించిన మోదీ, మూడు సాధారణ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు.
Details
ఆరు ఎన్నికల్లో ఒకే పార్టీ తరఫున విజయం సాధించిన ఏకైక నాయకుడిగా గుర్తింపు
ఇక గతేడాది జులైలో వరుసగా ఎక్కువకాలం ప్రధానిగా పనిచేసిన నేతల్లో ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి దేశంలో రెండో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా నిలిచారు. అంతేకాకుండా వరుసగా ఆరు ఎన్నికల్లో ఒకే పార్టీ తరఫున విజయం సాధించిన ఏకైక నాయకుడిగా మోదీ నిలిచారు. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, 2014, 2019, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానిగా కొనసాగుతున్నారు.