Physical Education: వ్యాయామ విద్యకు మహర్దశ.. 1958లో ప్రారంభమైన కళాశాలకు కొత్త రూపు
ఈ వార్తాకథనం ఏంటి
అది రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల. విద్యార్థుల్లో దేహదారుఢ్యాన్ని పెంపొందించడంతోపాటు భవిష్యత్ వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ అందించే కీలక సంస్థ. హైదరాబాద్ దోమలగూడలో 1958లో ప్రారంభమైన ఈ కళాశాలలోని చాలా భవనాలు నిజాం కాలం నాటివి కావడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. కళాశాలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కొత్త భవనాలు నిర్మించడంతోపాటు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో మరో ఏడాదిన్నర కాలంలో కళాశాలకు మహర్దశ పట్టే అవకాశం ఉంది.
వివరాలు
అధ్యాపక పోస్టులన్నీ ఖాళీ
మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కళాశాలలో గతంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఎడ్), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఎడ్), మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఎడ్) కోర్సులు నిర్వహించేవారు.
అయితే భవనాలు శిథిలావస్థకు చేరడం, కనీస వసతులు లేకపోవడం, శాశ్వత అధ్యాపకుల కొరత వంటి కారణాలతో 2011 నుంచి పీజీ కోర్సును రద్దు చేశారు.
ప్రస్తుతం ఏటా డీపీఎడ్‌లో 200 మంది, బీపీఎడ్‌లో 60 మంది ప్రవేశాలు పొందుతున్నారు.
అయినప్పటికీ కనీస వసతులు అందుబాటులో లేకపోవడంతో హాస్టల్ సౌకర్యాన్ని తొలగించారు. ప్రస్తుతం కళాశాల పరిపాలనా భవనం కూడా రేకుల షెడ్‌లోనే కొనసాగుతోంది.
వివరాలు
కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
ఈ పరిస్థితుల నేపథ్యంలో 2023 సెప్టెంబరులో అప్పటి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించి కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.
అయితే నిధులు మంజూరు కాకపోవడంతో కళాశాల దుస్థితి కొనసాగుతోంది. కళాశాలకు 20 మందికిపైగా అధ్యాపకులు అవసరం.
పదవీ విరమణ చేస్తున్న అధ్యాపకుల స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ప్రస్తుతం రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరూ లేరు.
రెగ్యులర్ ఉద్యోగిగా ఉన్న ప్రిన్సిపల్ సైతం ఏడాది క్రితం పదవీ విరమణ పొందారు. దీంతో పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు.
వివరాలు
ఆధునిక ప్రాంగణానికి రెండు సంస్థలు సిద్ధం
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల మేరకు కళాశాలలో కొత్తగా పరిపాలనా భవనం, తరగతి గదులు, హాస్టళ్లు, సింథటిక్ ట్రాక్, జిమ్, యోగా సెంటర్ నిర్మించాల్సి ఉంది.
సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో హాస్టల్ భవనాల నిర్మాణానికి గ్రీన్ పార్క్ హోటల్, మిగిలిన భవనాల నిర్మాణంతోపాటు ఇతర వసతుల కల్పనకు రెడ్డీస్ ల్యాబ్ సూత్రప్రాయంగా అంగీకరించాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
''శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చినప్పుడు తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నాం.
కొత్త ప్రాంగణం నిర్మాణానికి దాదాపు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అవసరమవుతాయి. ప్రస్తుతం అంచనాలు రూపొందిస్తున్నామని నవీన్ నికోలస్ వివరించారు.