
Indiramma Canteens: ఇందిరమ్మ క్యాంటీన్లలో కొత్త ప్రయోగం.. హైదరాబాద్‌లో రూ.5కే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు, సామాన్య ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా కొనసాగిన అన్న క్యాంటీన్ల మాదిరిగా, ఇక్కడ కూడా తక్కువ ధరకు అల్పాహారాన్ని అందించాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ. 5కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇకపై రుచికరమైన టిఫిన్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఈ పథకాన్ని మొదటిగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో అమలు చేయనున్నారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలకు ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్ వంటకాలు అందించనున్నారు.
Details
ఎక్కువ మంది లబ్ధి చేకూరే అవకాశం
ఒక్కో టిఫిన్ తయారీకి సుమారుగా రూ. 19 ఖర్చవుతుందని అంచనా వేయగా, లబ్ధిదారుల నుంచి రూ. 5 మాత్రమే వసూలు చేసి మిగిలిన రూ. 14ను జీహెచ్ఎంసీ సబ్సిడీగా భరించనుంది. ఈ పథకానికి సంవత్సరానికి సుమారు రూ. 15.33 కోట్లు అవసరమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా ఆధునీకరించేందుకు రూ. 11.29 కోట్లు వెచ్చించనున్నారు. అదనంగా, మరో 11 కేంద్రాల మార్పు కోసం రూ. 13.75 లక్షలు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని క్యాంటీన్లలో రోజూ సుమారు 30 వేల మందికి పైగా మధ్యాహ్న భోజనాన్ని రూ. 5కే అందుకుంటున్నారు ఇప్పుడు అల్పాహార సేవలు ప్రారంభమవడంతో మరింత ఎక్కువమంది లబ్ధి పొందనున్నారు.