Loading...
Wood Pulp Railway Transport: రైల్వేలో సరికొత్త మైలురాయి.. తొలిసారి రైలులో ఉడ్‌ పల్ప్
రైల్వేలో సరికొత్త మైలురాయి.. తొలిసారి రైలులో ఉడ్‌ పల్ప్

Wood Pulp Railway Transport: రైల్వేలో సరికొత్త మైలురాయి.. తొలిసారి రైలులో ఉడ్‌ పల్ప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఇప్పటివరకు రోడ్డుమార్గంలోనే రవాణా అవుతున్న కలప గుజ్జు (ఉడ్‌ పల్ప్‌)ను తొలిసారిగా రైలుమార్గంలో తరలించారు. కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు కలప గుజ్జు లోడుతో ఉన్న రైలు శనివారం బయలుదేరింది. కలప గుజ్జు రవాణాను రైలుమార్గానికి మళ్లించడం రైల్వేలో సరికొత్త మైలురాయిగా నిలిచిందని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. గత ఒకటిన్నర దశాబ్దాలుగా మహారాష్ట్రలోని కాగిత పరిశ్రమలకు కలప గుజ్జును కాకినాడ పోర్టు నుంచి 1,061 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో రవాణా చేస్తున్నారు. ఈ సరకు రవాణాను రైలు మార్గానికి మళ్లించడం ద్వారా రైల్వేకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు.. పరిశ్రమల ప్రతినిధులతో ఇటీవల చర్చలు జరిపారు.

వివరాలు

ఒక వ్యాగన్‌లో 45 నుంచి 50 టన్నుల కలప గుజ్జు

అయితే, ఒక వ్యాగన్‌లో 45 నుంచి 50 టన్నుల వరకు కలప గుజ్జును లోడ్‌ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, రైల్వే మాత్రం 65.1 టన్నులకు ఛార్జీలు విధిస్తుండటంతో రవాణా వ్యయం తమకు భారంగా మారుతోందని పరిశ్రమల ప్రతినిధులు తెలిపారు.

దీంతో వారు రోడ్డు మార్గంలోనే సరకు రవాణాకు పరిమితమయ్యారని రైల్వే అధికారులు గుర్తించారు.

ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు రైల్వే అధికారులు ఈ ఏడాది జులైలో కలప గుజ్జు రవాణాకు అనుగుణంగా తగిన రేటింగ్‌ ప్రతిపాదనను రైల్వేబోర్డుకు సమర్పించారు.

ఈ ప్రతిపాదన ఆధారంగా కలప గుజ్జును గూడ్స్‌ టారిఫ్‌ క్లాస్‌-110 కింద సరుకుగా చేర్చారు. దీంతో దాని రవాణా ఛార్జీలను గణనీయంగా తగ్గించారు.

వివరాలు

రైల్వేకు రూ.20 కోట్ల వరకు ఆదాయం

ఛార్జీలు తగ్గడంతో పరిశ్రమల ప్రతినిధులు రోడ్డు రవాణాకు బదులుగా రైలుమార్గం వైపు మొగ్గుచూపారు.

ఈ క్రమంలోనే కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు కలప గుజ్జుతో కూడిన తొలి రైలు శనివారం బయలుదేరింది.

ప్రతి రేక్‌ ద్వారా రైల్వేకు వచ్చే సరకు రవాణా ఆదాయం సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఏడాదికి 1.5 లక్షల టన్నుల కలప గుజ్జును అదనంగా రైళ్ల ద్వారా లోడ్‌ చేయడం వల్ల రైల్వేకు సుమారు రూ.20 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.

కలప గుజ్జు రవాణాను రైలుమార్గానికి మళ్లించేందుకు కృషి చేసిన రైల్వే అధికారులను సందీప్‌ మాథుర్, వినీత్‌కుమార్, కె. సాంబశివరావు, మోహిత్‌ సోనాకియా అభినందించారు.

ADVERTISEMENT