LOADING...
Cylinder Booking : గ్యాస్ బుకింగ్‌పై కొత్త ట్విస్ట్.. 25 రోజుల గ్యాప్ రూల్ వచ్చేస్తుందా?
గ్యాస్ బుకింగ్‌పై కొత్త ట్విస్ట్.. 25 రోజుల గ్యాప్ రూల్ వచ్చేస్తుందా?

Cylinder Booking : గ్యాస్ బుకింగ్‌పై కొత్త ట్విస్ట్.. 25 రోజుల గ్యాప్ రూల్ వచ్చేస్తుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసినట్టుగా సమాచారం. మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ విధానంలో పెద్ద మార్పులు అమల్లోకి రానున్నాయి. ధరల పెంపు అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారు ముందుగా ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేయబోతోంది. కొత్త నియమాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్‌కు కనీసం 25 రోజుల గ్యాప్ తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని పూర్తిగా అమలు చేయనున్నారు. వినియోగదారుడికి ఓటీపీ వచ్చినప్పుడే సిలిండర్ అందజేయబడుతుంది.

వివరాలు

దేశీయ సరఫరాపై కూడా ప్రభావం

ఇక అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కూడా దేశీయ సరఫరాపై పడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత చమురు కంపెనీలు అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులు పెంచుతున్నాయి. జూన్ లేదా జులై నాటికి ఈ సరఫరాలు పూర్తికానున్నాయి. ప్రస్తుతం దేశానికి రోజుకు సుమారు 80 వేల టన్నుల ఎల్పీజీ అవసరం కాగా, దేశీయ ఉత్పత్తి మాత్రం దాదాపు 46 వేల టన్నులకే పరిమితమై ఉంది. ఇటీవల ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ సంస్థలు కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దాదాపు ఒక నెలపాటు కొత్త కనెక్షన్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మళ్లీ కొనసాగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

వివరాలు

మే 1 నుంచి ధరలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం

ఇదిలా ఉంటే, మరో కీలక అంశం ధరల పెంపు. వచ్చే నెల ప్రారంభం నుంచి వంటగ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 29న పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ పూర్తికానుండగా, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. దీంతో మే 1 నుంచి ధరలపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా 1వ తేదీన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సమీక్షించి నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో మే 1న ధరల పెంపుపై అధికారిక ప్రకటన వస్తుందా అనే ఆందోళన పేద, మధ్యతరగతి వర్గాల్లో కనిపిస్తోంది.

Advertisement