Sharad Pawar: ఇండియా కూటమికి షాక్.. ఎన్డీఏ వైపు శరద్ పవార్ అడుగులు?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తేనే రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇస్తామని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోకి మారతామని శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ)బేరసారాలు సాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 30న లోక్‌సభలో, డిసెంబర్ 2న రాజ్యసభలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెరవెనుక చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సభలో బిల్లుపై ఓటింగ్ జరిగేలోగా ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని ఇరు పక్షాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో లోక్‌సభ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలేకు మంత్రి పదవి ఇవ్వాలని ఎన్సీపీ-ఎస్పీ నాయకత్వం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ మంత్రి పదవుల కోసం డిమాండ్
ఇటీవల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఇండియా కూటమి చేపట్టిన నిరసనల్లో సుప్రియా సూలే ముందుండి పాల్గొన్నారు.
అయితే గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల పునర్విభజనకు అనుకూలంగా ఆమె మాట్లాడుతున్నారు.
కేంద్రంతో పాటు మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలోనూ రెండు కేబినెట్ శాఖలు ఇవ్వాలని ఎన్సీపీ-ఎస్పీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మరో భాగస్వామిగా కొనసాగుతోంది. ఎన్సీపీ-ఎస్పీకి చెందిన జయంత్ పాటిల్‌కు ఆర్థిక శాఖ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మరో కేబినెట్ పదవిని సీనియర్ నేత జితేంద్ర అవ్హాద్‌కు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఇతర సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించేందుకు మరో రెండు సహాయ మంత్రి(MoS)పదవులు కూడా ఇవ్వాలని పార్టీ కోరుతున్నట్లు సమాచారం.
వివరాలు
ముఖ్యమంత్రి పదవిపై ప్రచారం
అయితే శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన వార్తలను పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి.
రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీకి కేవలం 10మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, ముఖ్యమంత్రి పదవిపై వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని సుప్రియా సూలే ఇటీవల స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎన్సీపీ-ఎస్పీకి లోక్‌సభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు విషయంలో వీరి ఓట్లు కీలకం కానున్నాయి.
2023లో పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభించింది.
అయితే దాని అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టారు. ఈ అంశానికి సంబంధించిన డీలిమిటేషన్ ప్రతిపాదనకు గత ఏప్రిల్‌లో ఎన్డీఏకు ఎదురుదెబ్బ తగిలింది.
వివరాలు
కాంగ్రెస్‌కు శరద్ పవార్ ఏం చెప్పారు?
ఇప్పుడు ఎన్సీపీ-ఎస్పీ మద్దతుతో ఆ బిల్లును గట్టెక్కించాలని ఎన్డీఏ భావిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుకు అధికారికంగా మద్దతు ప్రకటించకముందే అధికార భాగస్వామ్యంపై ఒప్పందం ఖరారు కావాలని శరద్ పవార్ పార్టీలోని ఓ వర్గం భావిస్తున్నట్లు ఎన్డీటీవీకి ఓ సీనియర్ నేత వెల్లడించారు.
మరోవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరద్ పవార్ ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వానికి ఫోన్ చేసి తమ పార్టీ పరిస్థితులను వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్సీపీ-ఎస్పీలో చీలిక రాకుండా ఉండాలంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్పనిసరి అని ఇండియా కూటమి నేతలకు పవార్ వివరించినట్లు సమాచారం.
మరోవైపు పార్టీ నేతలు కూడా డీలిమిటేషన్‌కు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు.
వివరాలు
ఇండియా కూటమి సమావేశానికి ఆమె గైర్హాజరు
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరమని శరద్ పవార్ గతంలో ఓ అనధికారిక చర్చ సందర్భంగా తనకు చెప్పారని జితేంద్ర అవ్హాద్ తాజాగా వెల్లడించారు.
సుప్రియా సూలే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచితే రాష్ట్రాలు తమ ప్రాతినిధ్య వాటాను కోల్పోతాయనే ఆందోళన తొలగుతుందని ఆమె పేర్కొన్నారు.
శరద్ పవార్ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సమావేశాల కోసం సోమవారం నేరుగా ఢిల్లీకి వెళ్తానని సుప్రియా సూలే ఇప్పటికే ప్రకటించారు.
దీంతో శనివారం జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి ఆమె హాజరుకావడం లేదు. పవార్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
వివరాలు
కాంగ్రెస్ స్పందన
అయితే పార్టీ తరఫున ఓ ప్రతినిధిని ఢిల్లీకి పంపే అవకాశం ఉందని, ఆ ప్రతినిధి ఎంపీ మాత్రం కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాలపై మహారాష్ట్ర కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించింది.
85 ఏళ్ల వయసులోనూ శరద్ పవార్‌ను రాజ్యసభకు పంపేందుకు తాము గట్టిగా మద్దతు ఇచ్చామని గుర్తుచేసింది.
2026 మార్చిలో మహారాష్ట్రలోని ఏడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-ఎస్పీకి కేవలం 10 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని కాంగ్రెస్ తన పోస్టులో పేర్కొంది.
ఒక అభ్యర్థి గెలవాలంటే 36 ఓట్లు అవసరమని తెలిపింది.
వివరాలు
కాంగ్రెస్ కు 16మంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్‌కు 16 మంది, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే)కు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించింది.
శరద్ పవార్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సుప్రియా సూలే కాంగ్రెస్ నేతలను కోరారని, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎలాంటి సంకోచం లేకుండా అంగీకరించారని మరాఠీలో చేసిన పోస్టులో కాంగ్రెస్ వెల్లడించింది.