Page Loader
Andhrapradesh: జిల్లాకో 'సోలార్‌ రూఫ్‌ టాప్‌' నమూనా గ్రామం.. పీఎం సూర్యఘర్‌ కింద ఏర్పాటు: సీఎస్‌
జిల్లాకో 'సోలార్‌ రూఫ్‌ టాప్‌' నమూనా గ్రామం.. పీఎం సూర్యఘర్‌ కింద ఏర్పాటు: సీఎస్‌

Andhrapradesh: జిల్లాకో 'సోలార్‌ రూఫ్‌ టాప్‌' నమూనా గ్రామం.. పీఎం సూర్యఘర్‌ కింద ఏర్పాటు: సీఎస్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి జిల్లాలో ఒక నమూనా సోలార్‌ రూఫ్‌టాప్‌ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌),ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జూన్‌లోపు డిస్కంలు,నెడ్‌క్యాప్‌ సంయుక్తంగా మొత్తం మూడు లక్షల సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. డిస్కంల సీఎండీలు,ఇతర ఉన్నతాధికారులతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మొత్తం 20 లక్షల సౌర రూఫ్‌టాప్‌ కనెక్షన్లను ప్రజలకు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. జూన్‌ లోపు ప్రతి డిస్కం కనీసం 75 వేల కనెక్షన్లు ఇవ్వాలని,అలాగే నెడ్‌క్యాప్‌ కూడా మరో 75వేల కనెక్షన్లు అందించాలని సూచించారు.

వివరాలు 

బీసీ లబ్ధిదారుడికి మొత్తంగా రూ. 80,000 రాయితీ

అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులకు 2 కిలోవాట్ల వరకు సోలార్‌ కనెక్షన్‌ను పూర్తిగా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. బీసీ వర్గానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 20,000 మద్దతు ఇవ్వనుంది. దీంతో బీసీ లబ్ధిదారుడికి మొత్తంగా రూ. 80,000 రాయితీ లభిస్తుంది. ఈ సమాచారం ప్రజలందరికీ చేరేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఇప్పటివరకు మూడు డిస్కంలకు కలిపి ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ ద్వారా మొత్తం 12.12 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

వివరాలు 

దరఖాస్తులను పూర్తి చేస్తే రాష్ట్రానికి 1,172 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి 

దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల నుంచి మరో 5.87 లక్షల దరఖాస్తులు సమర్పించారు. ఈ మొత్తం దరఖాస్తులను పూర్తి చేస్తే రాష్ట్రానికి 1,172 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లభిస్తుందని అంచనా. ప్రతి లబ్ధిదారుడికి సోలార్‌ యూనిట్‌ను ఏర్పాటుచేసే ప్రక్రియను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని, ఆ తర్వాత ఐదు సంవత్సరాలపాటు ఆ యూనిట్‌ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎస్‌ స్పష్టం చేశారు.