Loading...
Supreme Court: రక్తసంబంధీకుల వివాహాలపై ప్రత్యేక చట్టం? కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు!
రక్తసంబంధీకుల వివాహాలపై ప్రత్యేక చట్టం? కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme Court: రక్తసంబంధీకుల వివాహాలపై ప్రత్యేక చట్టం? కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

సమీప రక్తసంబంధీకుల మధ్య జరిగే వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న అంశంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వానికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం లేదని, ఈ అంశంపై అవగాహన కల్పించేందుకే నోటీసులు జారీ చేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. రక్తసంబంధీకుల వివాహాలను కోర్టులు నియంత్రించలేవని, సామాజిక సంస్కరణల ద్వారా ఇలాంటి వివాహాలను నియంత్రించే అధికారం పూర్తిగా చట్టసభల పరిధిలోకి వస్తుందని అభిప్రాయపడింది.

వివరాలు

జన్యుపరమైన లోపాలపై పిటిషనర్ ఆందోళన

బెంగళూరుకు చెందిన చార్వి ఎస్ అనే న్యాయ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఆచారం పేరుతో పిల్లలను ముందుగానే అంచనా వేయగలిగే, నివారించదగిన జన్యుపరమైన లోపాలకు గురిచేసే ఈ పద్ధతిని చట్టం ఇంకా అనుమతించాలా? అని ఆమె తన పిటిషన్‌లో ప్రశ్నించారు.

తాను కూడా సమీప రక్తసంబంధీకుల వివాహం వల్ల జన్మించానని, దాని కారణంగా 40 శాతం దృష్టి లోపంతో బాధపడుతున్నానని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

ఇలాంటి వివాహాల వల్ల జన్మించే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాలు, అవయవ లోపాలు, శిశు మరణాలు పెరుగుతున్నాయని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

వివరాలు

ప్రజల్లో అవగాహన కల్పించాలి

విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ తరహా వివాహాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయని తెలిపారు.

వీటి వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు సరైన అవగాహన లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. వివాహం అనేది వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయమని పేర్కొంది.

అయితే ప్రజలు సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకునేలా చైతన్యపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

పాఠశాల పాఠ్యాంశాల్లో ఈ అంశాన్ని చేర్చడం లేదా విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

ADVERTISEMENT

వివరాలు

హిందూ వివాహ చట్ట నిబంధనలపై పునఃపరిశీలనకు విజ్ఞప్తి

హిందూ వివాహ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఆచారాల పేరుతో సమీప రక్తసంబంధీకుల మధ్య వివాహాలకు ఉన్న మినహాయింపులను పునఃపరిశీలించాలని పిటిషనర్ కోరారు.

అలాగే వివాహానికి ముందు జన్యుపరమైన కౌన్సెలింగ్, వైద్య పరీక్షలు తప్పనిసరి చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ నిబంధనలు భవిష్యత్తులో జరిగే వివాహాలను నివారించేందుకు మాత్రమేనని, ఇప్పటికే జరిగిన వివాహాలను నేరంగా పరిగణించకూడదని పిటిషనర్ స్పష్టం చేశారు.

ADVERTISEMENT