
AP: ఆంధ్రప్రదేశ్'లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే..25 లక్షల మంది రెడీ..!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి వద్ద నుంచే పని)సంస్కృతిని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఈ దిశగా,ముందుగా ఎంత మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఓ సర్వే చేపట్టింది.
ఈ సర్వే ద్వారా పొందిన అభిప్రాయాల ఆధారంగా, రాష్ట్రంలోని పలు శాఖల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రస్తుతం,రాష్ట్రంలో తగిన సదుపాయాలు కల్పిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారా లేదా అనే అంశంపై సర్వే కొనసాగుతోంది.
ఈ సర్వేలో ఇంటర్,డిగ్రీ,డిప్లమో, ఇతర విద్యార్హతలు కలిగిన 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులను చేర్చారు.
వివరాలు
కోటి మందిపై పూర్తైన సర్వే
సుమారు 25 లక్షల మంది యువతీ యువకులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది.
ఈ వివరాలను కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు.
ఏపీ రాష్ట్రంలో మొత్తం 2.68 కోట్ల మంది 18-50 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రజలు ఉన్నట్లు అంచనా.
వారిలో దాదాపు కోటి మందిపై ఈ సర్వే పూర్తయింది.అందులో, 11లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు,13లక్షల మందికి పైగా డిప్లమో లేదా అంతకన్నా అధిక విద్యార్హతలు కలిగినవారు ఉన్నారు.
వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని అందించేందుకు 118ప్రభుత్వ భవనాలను గుర్తించారు.
వివరాలు
త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం
అంతేకాక, ఇప్పటికే 2.13 లక్షల మంది హైదరాబాద్, బెంగళూరులోని ఐటీ కంపెనీల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్నారని సర్వేలో తేలింది.
త్వరలో సర్వే పూర్తయ్యాక, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.