LOADING...
Goa: గోవాలో ఘోర విషాదం.. సిలిండర్‌ పేలి 25 మంది మృతి
గోవాలో ఘోర విషాదం.. సిలిండర్‌ పేలి 25 మంది మృతి

Goa: గోవాలో ఘోర విషాదం.. సిలిండర్‌ పేలి 25 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న 'బర్చ్‌ బై రోమియో లేన్‌' నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో భయంకర విషాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు పర్యాటకులు ఉన్నారని, మిగతావారు క్లబ్‌ సిబ్బందేనని ముఖ్యమంత్రి ప్రమోద్‌ కుమార్‌ సావంత్‌ తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉండగా, వారు కిచెన్‌ విభాగం సిబ్బందిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్‌ రాష్ట్ర రాజధాని పనాజీ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Details

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం ప్రమోద్ కుమార్

గతేడాది ఈ క్లబ్‌ ప్రారంభించబడినట్లు సమాచారం. సిలిండర్‌ పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవా బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం సీఎం ప్రమోద్‌ కుమార్‌ సావంత్‌, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్‌ లోబోతో కలిసి ప్రత్యక్షంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపనున్నట్టు సీఎం ప్రకటించారు. నైట్‌క్లబ్‌లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించలేదనే ప్రాథమిక సమాచారం తమకు అందిందని ఆయన చెప్పారు. విచారణలో ఈ అంశం నిర్ధారితమైతే క్లబ్‌ నిర్వాహకులతో పాటు, అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

Details

అనుమతులు లేని క్లబ్‌ల లైసెన్సులను రద్దు చేస్తాం

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సావంత్‌, మరణించిన వారికి సానుభూతి తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎమ్మెల్యే మైఖేల్‌ లోబో చెప్పారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రాంతంలోని అన్ని నైట్‌క్లబ్‌లపై సమగ్ర తనిఖీలు చేపడతామని, అనుమతులు లేని క్లబ్‌ల లైసెన్సులను రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు.

Advertisement