
Karreguttalu: కర్రెగుట్టలో భయానక వాతావరణం.. కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న అడవులు!
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో 'బ్లాక్ హిల్స్'గా పేరొందిన కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు సుదీర్ఘ కూంబింగ్ నిర్వహించాయి.
సాయంత్రం నాలుగు గంటల తర్వాత చీకటి వ్యాపించడంతో పాటు, అత్యంత దట్టమైన అడవి కారణంగా అక్కడ 5 అడుగుల దూరంలోనూ మనిషి కనిపించలేని స్థితి నెలకొంటుంది.
దీంతో మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని తమకు అత్యంత సురక్షితంగా భావిస్తున్నారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భద్రతా బలగాల ఆపరేషన్ కత్తిమీద సాముగా మారింది.
శుక్రవారం రాత్రి కర్రెగుట్ట ప్రాంతం బాంబులు పేలుడు శబ్దాలతో, కాల్పుల మోతతో భయబ్రాంతులకు గురయ్యామని స్థానిక గిరిజనులు తెలిపారు.
Details
అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
శనివారం ఉదయం ఏడుగంటల నుంచి నాలుగు హెలికాప్టర్లు నిరంతరం గగనంలో చక్కర్లు కొడుతున్నాయని వర్ణించారు.
గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో డీఆర్‌జీకి చెందిన ఒక జవాన్‌కు గాయాలు కాగా, అతడిని బీజాపుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి, భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గం ప్రాంతాల్లో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది.
90 కిలోమీటర్ల పొడవున్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తీసుకోవాలనే లక్ష్యంతో వేల సంఖ్యలో భద్రతా బలగాలు జల్లెడగా మోహరించాయి.
Details
పెద్ద ఎత్తున్న పేలుడు సామగ్రి స్వాధీనం
శనివారం సాయంత్రం కొంతమేర కొండలపైకి ఎక్కగలిగిన బలగాలు, మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించారు.
ఇప్పటివరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు.
శనివారం భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్లు ప్రచారం జరిగినప్పటికీ, అధికారికంగా దీనిని నిర్ధారించలేదు.