LOADING...
Terrorist is a Terrorist: 'ఉగ్రవాది ఉగ్రవాదే'.. ఐరాస వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
'ఉగ్రవాది ఉగ్రవాదే'.. ఐరాస వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

Terrorist is a Terrorist: 'ఉగ్రవాది ఉగ్రవాదే'.. ఐరాస వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని సహించబోమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) వేదికగా పునరుద్ఘాటించింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ఐరాస నిర్వహించిన తాజా సమీక్ష సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఉగ్రవాది అంటే ఉగ్రవాదే. అతడిని సమర్థించేలా ఎలాంటి కారణాలు వెతకకుండా, ఈ హంతక భావజాలాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు సమష్టిగా కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారత్ తీవ్రంగా నష్టపోయిందని, అనేక కుటుంబాలు జీవితాలను కోల్పోయి తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాల సరఫరా నిలిపివేసే చర్యలు

సొంత ప్రజలు అనుభవించిన బాధ, నష్టం వల్లే ఉగ్రవాదంపై భారత వైఖరి మరింత దృఢంగా మారిందని హరీశ్ తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు లేదా వ్యూహాత్మక లెక్కలు ఎలా ఉన్నా, ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లోనూ ఎలాంటి సందేహం లేకుండా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన సమగ్ర చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ఉగ్రవాదాన్ని సమర్థంగా అణచివేయడంలో ప్రపంచ దేశాలు సమన్వయంతో ముందుకు సాగలేకపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లోటుపాట్లను సరిదిద్దేలా అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడంతో పాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాల సరఫరా నిలిపివేసే చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు.

వివరాలు 

ఈ సాధనాలను ఉగ్రవాద సంస్థలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి 

ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిని విడిచిపెట్టి అన్ని సభ్యదేశాలు ఒకే దృక్పథంతో ముందుకు రావడానికి అవసరమైన రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించాలని హరీశ్ కోరారు. ఆధునిక సాంకేతికతను ఉగ్రవాద సంస్థలు వేగంగా వినియోగిస్తున్నాయని కూడా ఆయన హెచ్చరించారు. డ్రోన్లు, కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌ఫేక్ సాంకేతికత, వర్చువల్ కరెన్సీలు, డార్క్‌వెబ్ వంటి సాధనాలను ఉగ్రవాద సంస్థలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కొత్త తరహా ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా, ఉగ్రదాడుల వల్ల నేరుగా నష్టపోయిన బాధితుల పునరావాసంపై కూడా అంతర్జాతీయ సమాజం ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి అవసరమైన సహాయాన్ని అందించే దిశగా సమిష్టి చర్యలు తీసుకోవాలని భారత్ తరఫున పిలుపునిచ్చారు.

Advertisement