మూఢ నమ్మకానికి పరాకాష్ట: ఇనుప రాడ్‌తో 51సార్లు వాతలు, మూడు నెలల చిన్నారి మృతి
మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతమైన షాదోల్ జిల్లాలో దారుణం జరిగింది. మూఢ నమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలైంది. న్యుమోనియాతో బాధపడుతున్న మూడు నెలల చిన్నారిని తల్లదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, క్షుద్ర పూజలు చేసే అతని వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అతడు వేడి ఇనుప రాడ్‌తో చిన్నారి పొట్ట చుట్టూ 51సార్లు వాతలు పెట్టాడు. దీంతో చిన్నారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారి 15రోజులు పాటు మృత్యువుతో పోరాడి, చివరికి చనిపోయింది.
శిశు సంక్షేమ అధికారులకు తెలియడంతో విషయం వెలుగులోకి..
చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులు ఖననం చేశారు. ఈ విషయం తాజాగా శిశు సంక్షేమ అధికారులకు తెలియడంతో వెలుగులోకి వచ్చింది. ఖననం చేసిన చిన్నారి మృతదేహాన్ని శిశు సంక్షేమ అధికారులకు బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లోని అనేక గిరిజన ప్రాంతాల్లో న్యుమోనియాకు చికిత్స చేయడానికి వేడి ఇనుప రాడ్‌తో పొట్టపై వాతలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అది ప్రమాదం అని చెప్పినా ఆ ప్రాంతప ప్రజలు వినడం లేదని ఆరోగ్య కార్యకర్తలు చెబున్నారు. తాజాగా చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులను స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త వారించారు. అయినా వారు వినలేదని కలెక్టర్ వైద్ పేర్కొన్నారు.