IndiGo:రన్‌వేపై ఇరుక్కున్న ట్రాక్టర్.. 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం
పట్నా జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై ట్రాక్టర్ మొరాయించడంతో, కోల్‌కతా నుండి పట్నాకు రానున్న విమానం ల్యాండ్ అయ్యే ముందు సుమారు 40 నిమిషాలపాటు గాల్లోనే తిరిగింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయ రన్‌వేపై గడ్డి కోస్తున్న ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. ఆ సమయంలో కోల్‌కతా నుండి పట్నా బయలుదేరిన ఇండిగో విమానం రన్‌వేపై ల్యాండ్ కావాల్సి ఉంది. ట్రాక్టర్ ను అక్కడి నుండి తొలగించేందుకు సిబ్బంది 20 నిమిషాలపాటు శ్రమించారు.
క్షమాపణలు తెలిపిన ఇండిగో సంస్థ
ఆ సమయంలో రన్‌వేపై ట్రాక్టర్ ఉండటం వల్ల విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ కారణంగా విమానం 40 నిమిషాల పాటు గాల్లో తిరిగినప్పటికీ, చివరికి పట్నా విమానాశ్రయానికి సురక్షితంగా చేరింది. దీనిపై విమానాశ్రయం అధికారులు సమాధానం ఇచ్చారు. ప్రయాణికులకు జరిగిన ఆలస్యం, అసౌకర్యం కారణంగా క్షమాపణలు తెలిపినట్లు వెల్లడించింది.