CM Chandrababu: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విశ్వవిద్యాలయం.. ఏపీలో త్వరలో స్థాపన
డిసెంబరు 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు పేరుతో ప్రత్యేక తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా గతంలో తాము నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడిందని చంద్రబాబు తెలిపారు.
తెలుగు ప్రజలకు మార్గదర్శకంగా పొట్టి శ్రీరాములు
తెలుగు రాష్ట్రం ఆవిర్భావానికి ఆ మహనీయుడి ప్రాణ త్యాగమే ప్రధాన కారణమని గుర్తుచేశారు. సంకల్పసిద్ధి కోసం ప్రాణాలను త్యజించిన ఏకైక మహానీయుడు పొట్టి శ్రీరాములు అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపాలని, ఆయన జీవితం నుంచి ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఘన నివాళులర్పించారు. ఆయన సంకల్పం, త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తుందని నేతలు పేర్కొన్నారు.