Nara Lokesh: అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం
తెలంగాణలో ఐటీ విప్లవాన్ని సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారిలోనే, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. అమెరికా చేరుకున్న లోకేష్‌కు శాన్ ఫ్రాన్సిస్కో నగర విమానాశ్రయంలో తెలుగు ప్రముఖులు, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. తెలుగు దేశం పార్టీ ప్రవాస నేతలు, కార్యకర్తల నుంచి లోకేష్ ప్రత్యేక అభినందనలు అందుకున్నారు. హైటెక్ సిటీ పేరుతో ఐటీ రంగ అభివృద్ధికి దారితీసిన చంద్రబాబు విజన్ 2020ను గుర్తు చేస్తూ, తండ్రి మార్గంలో నడుస్తున్న లోకేష్ ఆంధ్ర ప్రదేశ్‌కు 2047 నాటికి వికసిత రాష్ట్ర స్థాయిని అందించాలనే కాంక్షతో కృషి చేస్తున్నారన్నారు.
కూటమి విజయం తర్వాత తొలి విదేశీ పర్యటనలో నారా లోకేష్
ఎన్డీఏ కూటమి విజయానంతరం మంత్రి నారా లోకేష్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. 29న లాస్ వేగాస్‌లో జరిగే 'ఐటీ సర్వీస్ సినర్జీ' 9వ సదస్సులో పాల్గొననున్నారు. 31న అట్లాంటా నగరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా లోకేష్ పాల్గొననున్నారు. విమానాశ్రయంలో టీడీపీ యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, జోనల్ ఇన్ చార్జ్ రవి మందలపు సహా పలువురు టీడీపీ కార్యకర్తలు, ఐటీ సర్వ్ ప్రతినిధుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది.