
Karimnagar: కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి పరార్
ఈ వార్తాకథనం ఏంటి
కరీంనగర్‌లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించలేదని యువతి గొంతు కోసి పరారయ్యాడు.
ఈ ఘటన కరీంగన్ జిల్లా కొత్తపల్లి కట్టేమిషన్ ఏరియాలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆడెపు వీరేశం, రేణుక దంపతుల కుమార్తె కావ్యశ్రీ పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతోంది.
బొద్దుల సాయి అనే యువకుడు వీరి ఇంటి ఎదురింట్లో ఉంటూ క్యారీలో ఉద్యోగం చేస్తున్నాడు.
సాయి గత నాలుగేళ్లుగా ఆ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
గతంలో ఓ సారి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినా కూడా ఆ యువతిని వేధించడం ఆపలేదు.
Details
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
ఇంట్లో ఆ యువతి ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న సాయి ఇంట్లోకి జోరబడ్డాడు. అనంతరం ఆమెపై దాడికి తెగబడ్డాడు.
తనను ప్రేమించాలని బలవంతం చేశాడు. ఆమె ప్రేమను నిరాకరించడంతో అక్కడే ఉన్న కత్తితో ఆమె గొంతు కోయడానికి ప్రయత్నించాడు.
యువతి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి సాయి పరారయ్యాడు.
వెంటనే యువతి చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
కరీంనగర్ రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితుడు సాయి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.