
Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB నివేదిక విడుదల.. పైలట్ల మధ్య చివరి సంభాషణ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై 'ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (AAIB) 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఈ ఘోర ఘటనలో 240 మంది ప్రయాణికులతో పాటు మరో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజా నివేదికలో AAIB పలు కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది.
Details
విమానం టేకాఫ్ తరువాత కొన్ని సెకన్లలోనే ప్రమాదం
విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంధన నియంత్రణ (ఫ్యూయల్ కంట్రోల్) స్విచ్‌లు ఆగిపోయాయని నివేదిక పేర్కొంది. 'స్విచ్‌ను నువ్వే ఆఫ్ చేశావా?' అంటూ ఒక పైలట్, మరో పైలట్‌ను ప్రశ్నించగా 'నేను ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చినట్లు రిపోర్ట్ తెలిపింది. ఈ డైలాగ్ కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య జరిగిన చివరి సంభాషణగా పేర్కొంది. మాట్లాడిన కొద్ది సేపటికే మేడేకాల్ ఈ సంభాషణ అనంతరం వెంటనే పైలట్లు మేడేకాల్ (Mayday Call) ఇచ్చినట్లు వెల్లడించారు. రెండు స్విచ్‌లు ఒకదానిని అనుసరించి కేవలం ఒక సెకన్ల తేడాతో ఆగినట్లు నివేదిక స్పష్టం చేసింది. విమానం గాల్లో కేవలం 32 సెకన్లపాటు మాత్రమే ప్రయాణించినట్లు వివరించింది.
Details
విమాన కూలిన స్థలం, టర్బైన్ యాక్టివేషన్
రన్‌వేకు కేవలం 0.9 నాటికల్ మైళ్ల దూరంలోని ఓ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయిందని వివరించింది. ఇంజిన్లు శక్తి కోల్పోయిన వెంటనే, ర్యామ్ ఎయిర్ టర్బైన్ యాక్టివేట్ అయినట్లు గుర్తించారని తెలిపింది. దీనిని సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా గుర్తించామని పేర్కొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు స్పందన రాలేదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ప్రయత్నించినప్పటికీ పైలట్ల నుంచి స్పందన రాకపోవడంతో విమానం కూలిపోయిందని నివేదిక తెలియజేసింది.
Details
ప్రమాదానికి సంబంధించి మరిన్ని అంశాలు
ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తయిందని వెల్లడించింది. విమానానికి చెందిన రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు సంబంధించి కొన్ని కాంపోనెంట్స్‌ను గుర్తించినట్లు తెలిపింది. ఈ ఇంజిన్లను భద్రంగా భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఇంధనం, బరువు లిమిట్స్‌లోనే ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది. ఎటువంటి ప్రమాదకర వస్తువులు విమానంలో లేవని నివేదిక తేల్చింది. ఇంధనంలో ఎలాంటి కలుషితత ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. ఈ ప్రాథమిక నివేదిక మరిన్ని విషయాల కోసం దర్యాప్తు కొనసాగుతుందని సూచిస్తోంది.