Bhupat Bhayani: కేజ్రీవాల్‌కు షాక్.. రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యే
వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భూపత్ భయానీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశ్వదార్ నియోజకవర్గం నుంచి భూపత్ భయానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చాలా కాలంగా ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. బీజేపీ గుజరాత్ అధ్యక్షుడిని మంగళవారం భూపత్ భయానీ కలిశారు. దీంతో అప్పటి నుంచి భూపత్ భయానీ ఆమ్ ఆద్మీ పార్టీని వీడుతున్నట్లు గుజరాత్ రాజకీయాల్లో చర్చ జరిగింది. అందరూ అనుకున్నట్లుగా ఆయన ఆప్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు.
గుజరాత్‌లో 4కు పడిపోయిన ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య
భూపత్ భయానీ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి ఆమోదించారు. దీంతో మరో ఆరు నెలల్లో విశ్వదార్ నియోజకవరంగలో ఉప ఎన్నిక జరగనుంది. భూపత్ భయానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మిగతా ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. భూపత్ భయానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 4కు పడిపోయింది.