Punjab elections: పంజాబ్ ఎన్నికలకు ఆప్ తొలి జాబితా.. ధురి నుంచి సీఎం భగవంత్ మాన్ పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారు. జైలులో ఉన్న మంత్రి సంజీవ్ అరోరాకు కూడా పార్టీ టికెట్ కేటాయించింది. ఆయన లూథియానా వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న 40మందికి ఆప్ మరోసారి అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పోటీ చేయనున్న ధురి నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి కంచుకోటగా పరిగణిస్తారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాన్.. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
వివరాలు
21 వార్డులకు గాను 20 స్థానాలను కైవసం
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆప్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ధురి మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని మొత్తం 21 వార్డులకు గాను 20 స్థానాలను కైవసం చేసుకుంది.
ఇదిలా ఉండగా, జైలులో ఉన్న ఎంపీ, వారిస్ దే పంజాబ్ అధినేత అమృత్పాల్ సింగ్ కూడా ధురి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఖడూర్ సాహిబ్ ఎంపీగా ఉన్న ఆయన.. ధురితో పాటు ఖడూర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే జరిగితే ధురి నియోజకవర్గ పోరు పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. పంజాబ్ శాసనసభలో మొత్తం 117 స్థానాలు ఉన్నాయి.
వివరాలు
2027లో అసెంబ్లీ ఎన్నికలు
2027లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండగా, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు కాంగ్రెస్ కూడా అధికారాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అకాలీదళ్, బీజేపీ సైతం ఎన్నికల బరిలో నిలవనున్నాయి.
ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో పంజాబ్లో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.