Andhra news: గ్రామీణ క్రికెటర్లకు సువర్ణావకాశం.. ఏసీఏ రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
మీరు క్రికెట్‌లో మంచి ప్రతిభ చూపగలరా? మీలోని ఆట ప్రతిభకు సరైన గుర్తింపు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అలాంటి యువ క్రికెటర్ల కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేకంగా'విలేజ్ టు విరాట్'నినాదంతో 'రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం'ను రూపొందిస్తోంది. ఏపీలోని దూర గ్రామాలు,మారుమూల ప్రాంతాల నుంచి వెలుగులోకి రాని క్రికెట్ ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 88నియోజకవర్గాల్లో ఈ టాలెంట్ సెర్చ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏసీఏ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏర్పాట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. ఏప్రిల్ 5న ఈ రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాంను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఏసీఏవర్గాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
ప్రతి నియోజకవర్గం నుంచి 20 నుంచి 50 మంది
ఈ కార్యక్రమంలో యువతీ యువకులెవరైనా పాల్గొనవచ్చు. ముఖ్యంగా 19 ఏళ్ల లోపు వయోపరిమితి ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అనంతరం ఇతర వయసు గల ఆటగాళ్లను వారి నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసంగా 20 నుంచి 50 మంది వరకు ప్రతిభావంతులను ఎంపిక చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు క్రికెట్ సెలక్షన్లలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల ఆటగాళ్లే ముందుకు వస్తుండటంతో, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రతిభావంతులు అవకాశాలకు దూరమవుతున్నారు. ఈ లోటును భర్తీ చేసి, గ్రామీణ క్రీడాకారులకు సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా యువతను ప్రోత్సహించడమే కాకుండా, దీనిపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించనున్నారు.
వివరాలు
మూడు జోన్లు.. ఒకేసారి ఎంపికలు
ఎంపిక ప్రక్రియను పూర్తిగా క్షేత్రస్థాయిలోనే నిర్వహించనున్నారు. ఏసీఏకి చెందిన సెలక్టర్లు,సిబ్బంది నేరుగా గ్రామాలు, మండలాలకు వెళ్లి ఆటగాళ్లను పరిశీలిస్తారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, ఒకేసారి ఎంపికలు చేపడతారు. ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు కేంద్రాల్లో సెలక్షన్లు నిర్వహించడంతో పాటు,ఆయా ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తారు. బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు ఇలా అన్ని విభాగాలకు చెందిన ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.
వివరాలు
ఎంపికైన క్రీడాకారులకు ఫెసిలిటేటింగ్ సెంటర్లలో శిక్షణ
ఎంపికైన క్రీడాకారులకు వారి ప్రతిభను బట్టి అకాడమీల్లో, ఫెసిలిటేటింగ్ సెంటర్లలో శిక్షణ అందిస్తారు. అవసరాన్ని బట్టి ఉచిత వసతి, రవాణా భత్యం కూడా కల్పించనున్నారు. వయోపరిమితిని అనుసరించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశాలు ఇస్తారు. ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉంటే, అక్కడే స్థానిక కోచ్‌ను నియమించి ప్రాక్టీస్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన క్రీడా పరికరాలను కూడా ఉచితంగా అందించనున్నారు.