Konda Surekha: కొండా సురేఖకు యాక్సిడెంట్.. కంటతడి పెట్టుకున్న కొండా మురళీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాహుల్ గాంధీ పర్యటనలో భాగంలో కొండా సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపు తప్పడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమెను భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరి పేరిట బస్సు యాత్రలో పాల్గొన్నారు. రెండో రోజైన నేడు భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో కొండా సురేఖ పాల్గొన్నారు. అయితే కొండా సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో ఆమె కుడి కన్ను పై భాగం, చేతికి గాయాలయ్యాయి.
హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్న కొండా మురళీ
కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురైన విషయాన్ని తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళీ హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమెకు తగిలిన గాయాలు చూసి కంటతడి పెట్టారు. అయితే కొండా సురేఖకు పెను ప్రమాదం తప్పడంతో కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కోసం తొలి జాబితాను కాంగ్రెస్ 55 మందితో ప్రకటించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాలో ఆమె పేరు లేదు. రెండో జాబితాలో ఆమె పేరు ఉంటే ఛాన్స్ ఉంది.