నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
ఆగస్టులో నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణ కేసులో నిందితుడిగా పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) యాత్ర అనంతరం జరిగిన హింసలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం ఉందని హర్యానా పోలీసులు తెలిపారు. మమ్మన్ ఖాన్ ప్రస్తుతం ఫిరోజ్‌పూర్ జిర్కా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్య వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, తన అరెస్టును ముందే ఊహించిన మమ్మన్ ఖాన్ ముందస్తు బెయిల్ కోసం మంగళవారం పంజాబ్- హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 19న జరగనుంది. హింస చెలరేగిన రోజు తాను నుహ్‌లో కూడా లేనని, తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని మమ్మన్ ఖాన్‌ను తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాకే ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చాం: పోలీసులు
నూహ్ అల్లర్ల కేసులో అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాకే ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు కోర్టుకు తెలియజేశారు. ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అంతకుముందు, విచారణ బృందం ముందు హాజరు కావాలని ఎమ్మెల్యేకు నూహ్ పోలీసులు రెండుసార్లు సమన్లు పంపారు. అయితే ఆయన తనకు వైరల్ ఫీవర్ ఉందని విచారణకు హాజరు కాలేదు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసేలా హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఖాన్ తాను హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు.