Tvk First Anniversary: మహాబలిపురంలో టీవీకే వార్షికోత్సవ సభ.. విజయ్ పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ పార్టీ "తమిళగ వెట్రి కళగం" (టీవీకే) ఆవిర్భావ దినోత్సవం మహాబలిపురంలో జరుగనుంది.
ఈ వేడుక నుంచి వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ రాజకీయ శంఖం పూరించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొననున్నారు.
అంతేకాదు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి,ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్. రంగస్వామి కూడా ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.
పార్టీ స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించే ఈ భారీ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
అదే విధంగా, పార్టీ సర్వసభ్య మండలి, కార్యాచరణ మండలి సమావేశాల తేదీలను కూడా విజయ్ ఈ సభలో ప్రకటించనున్నారు.
వివరాలు
ప్రశాంత్ కిషోర్ - టీవీకే వ్యూహకర్తగా!
ఇటీవల విజయ్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడానికి అంగీకరించారు.
విజయ్‌కు తన పూర్తి మద్దతు అందిస్తానని, పార్టీకి ప్రత్యేక సలహాదారుడిగా మార్గదర్శకత్వం ఇస్తానని హామీ ఇచ్చారు.
"GetOut" హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయిన్!
విజయ్ తన పార్టీ తరఫున "GetOut" హ్యాష్‌ట్యాగ్‌ను ప్రధాన ప్రచార నినాదంగా మార్చారు.
ఇటీవల తమిళనాడులో అధికార డీఎంకే "#GetOutModi" మరియు బీజేపీ "#GetOutStalin" ట్రెండ్‌లు నడిపిన నేపథ్యంలో, విజయ్ మాత్రం ఏకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేర్లు లేకుండానే "GetOut" క్యాంపెయిన్ ప్రారంభించడం గమనార్హం.
టీవీకే ఆధ్వర్యంలో రహస్య కూటమి తమిళనాడును విస్మరిస్తోందని ఆరోపిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వివరాలు
విజయ్ రాజకీయ ప్రవేశంపై పెరుగుతున్న ఆసక్తి!
విజయ్ రాజకీయ ప్రవేశాన్ని గతంలో సినిమా రంగం నుంచి వచ్చి ముఖ్యమంత్రులైన ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలితలతో పోలుస్తున్నారు.
అయితే, శివాజీ గణేశన్, విజయ్ కాంత్, కమల్ హాసన్ లాంటి సినీ నటులు రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
రజనీకాంత్ కూడా రాజకీయంగా వెనుకడుగు వేయడంతో, విజయ్ తనదైన శైలిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలో రాష్ట్ర పాలన, శాంతిభద్రతలు, కుటుంబ రాజకీయాలపై తరచూ విమర్శలు చేస్తున్నారు.
వివరాలు
కేంద్ర ప్రభుత్వంపై విజయ్ విమర్శలు!
కేవలం రాష్ట్ర రాజకీయాలే కాకుండా,విజయ్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
'ఒకే దేశం - ఒకే ఎన్నిక' బిల్లుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు,జయలలిత మరణం తర్వాత నాయకత్వ లేమితో సతమతమవుతోన్న అన్నాడీఎంకేతో టీవీకే పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదే జరిగితే, అధికార డీఎంకేకు వచ్చే ఎన్నికల్లో గట్టిపోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు విజయ్‌ను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాయో చూడాలి!
గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కోసం వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్,ఈసారి విజయ్ పార్టీ టీవీకే కోసం వ్యూహాలు రచించనున్నారు.
అయితే,ఈ వ్యూహాలు విజయ్‌ను రాజకీయంగా ఎంతవరకు విజయవంతం చేస్తాయనేది 2026 ఎన్నికల వరకూ వేచిచూడాల్సిందే!