
Inter Admissions: తెలంగాణ ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరిగాయ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సాధారణ అంచనాల ప్రకారం, ఈ ఏడాది గురుకులాల విస్తరణ, 123 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ఇంటర్మీడియట్ స్థాయికి విస్తరించడం వంటి చర్యల కారణంగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గుతాయని అందరూ భావించారు. అయితే, భిన్నంగా గతేడాది పోలిస్తే ఈ ఏడాది 8,482 మంది అదనంగా కళాశాలల్లో చేరినట్లు ఇంటర్ విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నప్పటికీ, గత విద్యా సంవత్సరం (2024-25) ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 83,635 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈసారి ఆ సంఖ్య 92,117కి చేరింది.
వివరాలు
విద్యార్థుల హాజరుపై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం
ఈ విద్యా సంవత్సరం (2025-26) నుండి విద్యార్థులు ఎప్‌సెట్, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఫిజిక్స్‌వాలా, అన్‌అకాడమీల ద్వారా ఆన్‌లైన్ శిక్షణ మొదలుపెట్టారు. అలాగే విద్యార్థుల హాజరుపై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ప్రతి వారం ఒక రోజు క్రీడల కోసం, మరో రోజు ధ్యానం కోసం, మరొక రోజు ల్యాబ్‌లో ప్రయోగాలు నిర్వహించడం తప్పనిసరి చేశారు.
వివరాలు
ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఎంఎస్ అమలు..
ఇంటర్ విద్యాశాఖ పరిధిలో బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర ఉద్యోగులు, అధికారులు సుమారు 8,000 మంది పనిచేస్తున్నారు. వారి సెలవులను మంజూరు చేయడానికి హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(హెచ్‌ఆర్‌ఎంఎస్) పేరిట కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల అనధికారికంగా గైర్హాజరయ్యే పరిస్థితులు రాకుండా, సెలవుల లెక్కలు ఖచ్చితంగా రికార్డు చేయబడతాయి అని ఇంటర్ విద్యాశాఖ వర్గాలు తెలిపారు. ప్రస్తుతం, ఈ సిస్టమ్‌లో రెండు మాడ్యూల్స్‌ను ప్రారంభించారు - సెలవులు మంజూరు చేయడం, ఎన్‌ఓసీలు (NOCs) జారీ చేయడం. ఈ నెలాఖరుకు మొత్తం 10 సేవలను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.