adulterated ghee: తిరుమల తరహాలోనే శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ పాలన సమయంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ)సరఫరా అయిన కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్),శ్రీశైలం మల్లన్న ఆలయానికీ అదే తరహా నెయ్యి చేరినట్టు గుర్తించింది. 2022 మే నుంచి 2023 మార్చి వరకు దాదాపు 11 నెలల పాటు కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు సమాచారం. సాధారణంగా విజయ డెయిరీ నుంచే నెయ్యిని కొనుగోలు చేసే శ్రీశైలం దేవస్థానం,ఆ కాలంలో మాత్రం తిరుపతికి చెందిన రాజేశ్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యిని కొనుగోలు చేసి,దానికి రూ.15.89 కోట్లను చెల్లించినట్టు వెల్లడైంది.
వివరాలు
అది భోలేబాబా 'నెయ్యే'!
శ్రీశైలం దేవస్థానానికి చేరిన నెయ్యి కూడా భోలేబాబా డెయిరీకి చెందిన 'నెయ్యి కాని నెయ్యే' అయి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే టీటీడీకి భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యి కాదని,వెజిటబుల్ ఆయిల్స్‌తో పాటు కొన్ని రసాయనాలు కలిపి తయారుచేసిన పదార్థమని సిట్ దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. రాజేశ్ కార్పొరేషన్ ద్వారా శ్రీశైలం దేవస్థానానికి సరఫరా అయిన నెయ్యి కూడా భోలేబాబా డెయిరీ నుంచే వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే రాజేశ్ కార్పొరేషన్‌కు స్వంత డెయిరీ లేదని సమాచారం. భోలేబాబా డెయిరీ తిరుపతికి చెందిన ఇతర సంస్థల పేర్లతో కూడా కల్తీ నెయ్యిని విక్రయించినట్టు సిట్ విచారణలో బయటపడింది.
వివరాలు
విజయ డెయిరీని పక్కన పెట్టారా?
అలాంటి సంస్థల నుంచే రాజేశ్ కార్పొరేషన్ నెయ్యిని కొనుగోలు చేసి, శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం, పాల సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డెయిరీల నుంచే నెయ్యిని కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని ట్రస్ట్‌బోర్డు గతంలో తీసుకుంది. నెయ్యి సరఫరా కోసం పిలిచే టెండర్లలో సాధారణంగా పాల సొసైటీల ఆధ్వర్యంలో ఉన్న డెయిరీలే పాల్గొనేవి. నంద్యాల కేంద్రంగా పనిచేసే విజయ డెయిరీ తక్కువ ధరకు నెయ్యిని అందించేందుకు ముందుకు రావడంతో, ప్రతి సారి సరఫరా కాంట్రాక్టు ఆ సంస్థకే దక్కేది. అయితే వైసీపీ హయాంలో 2022లో నెయ్యి ధర విషయంలో విజయ డెయిరీ ప్రతినిధులు, దేవస్థానం అధికారుల మధ్య ఒప్పందం కుదరలేదు.
వివరాలు
కిలో నెయ్యిని రూ.489కే..
ధరను మరింత తగ్గించాలని అధికారులు ఒత్తిడి తెచ్చినప్పటికీ, అంత తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదని విజయ డెయిరీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రాజేశ్ కార్పొరేషన్ రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. ఆ సంస్థ కిలో నెయ్యిని రూ.489కే ఇస్తామని ప్రతిపాదించడంతో, సరఫరా కాంట్రాక్టును వారికే అప్పగించారు. అప్పట్లో విజయ డెయిరీని కావాలనే పక్కన పెట్టారన్న ప్రచారం కూడా జరిగింది. శ్రీశైలం దేవస్థానంలో రోజుకు సగటున లక్షకు పైగా లడ్డూలు విక్రయమవుతుంటాయి. 2023 ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డెయిరీనే శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తోంది.