IAF new ensign: 72 ఏళ్ల తర్వాత కొత్త జెండాను ఆవిష్కరించిన భారత వైమానిక దళం
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఆదివారం(అక్టోబర్ 8) 91వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే ఈ వార్షికోత్సవం సందర్భంగా ఐఏఎఫ్ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన వార్షిక ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్‌లో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి వైమానిక దళం కొత్త జెండాను ఆవిష్కరించారు. 72 ఏళ్లలో భారత వైమానిక దళం తన జెండాను మార్చుకోవడం విశేషం. వలస పాలన మూలాలను చేరిపేయడంలో భాగంగానే ఐఏఎఫ్ తాజాగా తన జెండాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది నావికాదళం కూడా తన జెండాను మార్చుకున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చిహ్నం కుడి ఎగువ మూలలో ఉండేలా కొత్త జెండాను రూపొందించారు.
1932లో భారత వైమానిక దళం ఏర్పాటు
ఐఏఎఫ్ అధికారికంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అక్టోబర్ 8, 1932న స్థాపించబడింది. దాని విజయాలకు గుర్తింపుగా మార్చి 1945లో 'రాయల్' అనే బిరుదు లభించింది. ఆ తర్వాత రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా మారింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఐఏఎఫ్ 1950లో దాని పేరు నుంచి రాయల్ అనే పదాన్ని తొలగించింది. జెండాను కూడా మార్చింది. కొత్త జెండాలో కుడివైపు పైన జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దాని కింద దేవనాగరిలో 'సత్యమేవ జయతే' అని రాసి ఉంది. అశోక స్తంభం కింద ఒక హిమాలయ డేగ రెక్కలు విప్పి ఉంటుంది. డేగ రెక్కల కింద 'టచ్ ద స్కై విత్ ప్రైడ్' అనే నినాదం చెక్కబడి ఉంటుంది.