LOADING...
Dogesh: మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ.. దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ.. దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు

Dogesh: మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ.. దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల బిహార్‌లో ఓ కుక్కకు 'డాగ్‌ బాబు' అనే పేరుతో అధికారులు నివాస ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా నవాడా జిల్లాలో ఇదే తరహా మరొక ఘటన వెలుగుచూసింది. సిర్దాల బ్లాక్‌లోని ఆర్టీపీఎస్ కార్యాలయంలో 'డాగేశ్ బాబు' అనే పేరుతో ఉన్న ఓ కుక్క ఫొటోను జతచేసి నివాస పత్రం కోసం దరఖాస్తు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ రవి ప్రకాశ్‌కు తెలియగానే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీన్ని తేలికగా తీసుకోకుండా,దరఖాస్తు చేసిన వ్యక్తిపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలని, అతన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

వివరాలు 

మసౌర్హి డివిజన్‌లో 'డాగ్ బాబు'

ఇలాంటి సరదా చర్యల వల్ల ప్రభుత్వ యంత్రాంగం అపహాస్యం పాలవుతుందనీ,అధికారుల పనితీరు దెబ్బతింటుందనీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఈ విధంగా దుర్వినియోగం చేయడం అసహ్యకరమని, ఇలాంటివారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు ముందు బిహార్‌లోని మసౌర్హి డివిజన్‌లో ఇదే తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈ నెల 24న జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రంలో కుక్క పేరు 'డాగ్ బాబు'గా, తండ్రి పేరు 'కుత్తా బాబు'గా, తల్లి పేరు 'కుటియా దేవి'గా నమోదు చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సర్టిఫికెట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వివరాలు 

దరఖాస్తుదారు, కంప్యూటర్ ఆపరేటర్‌, పత్రాన్ని జారీ చేసిన అధికారిపై  కేసు 

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. అధికార వ్యవస్థను విమర్శిస్తూ ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. విపక్షం విమర్శల నేపథ్యంలో అధికారులు స్పందించి తక్షణమే ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యులుగా ఉన్న దరఖాస్తుదారు, కంప్యూటర్ ఆపరేటర్‌తో పాటు పత్రాన్ని జారీ చేసిన అధికారిపై కూడా కేసు నమోదు చేసినట్టు పట్నా జిల్లా యంత్రాంగం ప్రకటించింది.