ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)శనివారం సమన్లు పంపింది. ఇప్పటికే ఈ కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్, రబ్రీ దేవిలను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. జామ్ స్కామ్ కేసులో తేజస్వి యాదవ్‌కు సమన్లు జారీ చేసినట్లు సీబీఐకి చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఆయనకు సమన్లు జారీ చేయడం రెండోసారి అని ఆయన పేర్కొన్నారు. మొదటిది ఫిబ్రవరి 4న జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో గతేడాది అక్టోబర్‌లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో లాలూ, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి సహా మరో 13మంది పేర్లు ఉన్నాయి.
లాలూ కుమారుడు, కుమార్తెల ఇళ్లలో రూ.70 లక్షల నగదు, బంగారు ఆభరణాల స్వాధీనం
ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో తేజస్వి యాదవ్ ఇంట్లో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ యాదవ్ ముగ్గురు కూతుళ్ల ఇళ్లతో పాటు దిల్లీ, ముంబయి, పట్నాలోని బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహుతు ఇళ్లలో 24చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహించింది. శుక్రవారం జరిపిన దాడుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు, కుమారుడు తేజస్వి యాదవ్‌ల ఇళ్లలో రూ.70 లక్షల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 540 గ్రాముల బంగారు కడ్డీ, 900 అమెరికన్ డాలర్లు సహా విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ డీ ఉద్యోలను భూములు తీసుకొని ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.