జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం పాట్నాలోని తన నివాసంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ప్రశ్నించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)లో ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు రబ్రీదేవిపై ప్రశ్నల వర్షం కురిపించారు. 2004- 2009 లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలను డబ్బు తీసుకొని ఇప్పించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ డబ్బుతో లాలూ భూములను కొనుగోలు చేసినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. రబ్రీ దేవిని తదుపరి విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి అధికారులు పిలిపించే అవకాశం ఉంది.
మార్చి 15న కోర్టుకు హాజరుకావాలని ఆదేశం
సీబీఐ దాడులు జరుగుతున్న నేపథ్యంలో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా రబ్రీ దేవి నివాసానికి చేరుకున్నారు. ఉద్యోగాల కోసం భూ కుంభకోణంలో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, మరో 14 మందికి ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 27న సమన్లు జారీ చేసింది. నిందితులను మార్చి 15న కోర్టుకు హాజరుకావాలని ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ఆదేశించారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఒకరిని మినహాయిస్తే నిందితులకు సంబంధించి అరెస్టు చేయకుండానే చార్జిషీటు దాఖలు చేసినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.