POCSO Act : లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సు 18 ఏళ్లే.. మార్చకూడదన్న లా కమిషన్
ఫోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపే వయస్సుపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి లా కమిషన్ కీలక సూచన చేసింది. సమ్మతి వయస్సు 18 ఏళ్లేనని, 16కి తగ్గించకూడదని లా కమిషన్ పేర్కొంది. దాన్ని మార్చడం సరికాదని సూచించింది. ఒకవేళ సమ్మతి వయస్సు తగ్గిస్తే బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాల పోరాటంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద సమ్మతి వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించడం సరికాదని లా కమిషన్ తన సిఫార్సును న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించింది.
ఈఎఫ్ఆర్ నమోదును దశల వారీగా అమల్లోకి తీసుకురావాలి
16-18 ఏళ్ల పిల్లలకు సంబంధించిన ఇలాంటి కేసుల్లో వారు ఇష్టపూర్వకంగానే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే అలాంటి కేసుల పరిష్కారానికి చట్టంలో కొన్ని సవరణలు అవసరమని న్యాయ కమిషన్ తెలిపింది. అయితే ఈ కేసుల్లో శిక్షలు విధించేటప్పుడు న్యాయస్థానాలు విచక్షణ మేరకు నిర్ణయాలను తీసుకోవాలని పేర్కొంది. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఈఎఫ్ఆర్ నమోదును దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని లా కమిషన్ కేంద్రానికి సూచించింది. ఈ ఎఫ్ఐఆర్‌ల నమోదు కోసం కేంద్రీకృత జాతీయ పోర్టల్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.