LOADING...
AI-Powered AirSewa Portal: ఫ్లైట్ ఆలస్యమా.. లగేజీ పోయిందా? ఏఐతో ఎయిర్‌సేవా ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం
ఏఐతో ఎయిర్‌సేవా ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం

AI-Powered AirSewa Portal: ఫ్లైట్ ఆలస్యమా.. లగేజీ పోయిందా? ఏఐతో ఎయిర్‌సేవా ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. ఫ్లైట్ ఆలస్యం,లగేజీ మిస్ కావడం,టికెట్ సమస్యలు వంటి ఫిర్యాదులను మరింత వేగంగా పరిష్కరించేందుకు ఎయిర్‌సేవా (AirSewa) పోర్టల్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. ఇందులో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను కూడా వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్‌లో దేశీయ విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ప్రయాణికుల సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించేందుకు ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ (PACR)ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎయిర్‌లైన్స్, విమానాశ్రయాలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), డీజీసీఏ (DGCA), బీసీఏఎస్ (BCAS) వంటి సంస్థల ప్రతినిధులు కలిసి పనిచేస్తున్నారు.

వివరాలు 

73 వేలకుపైగా ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం 

పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం,2025 డిసెంబర్ 10 నుంచి ఇప్పటివరకు 73 వేలకుపైగా ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించారు. దాదాపు 98 శాతం ఫిర్యాదులకు సానుకూల పరిష్కారం లభించడం విశేషం. బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కొత్త ఎయిర్‌సేవా పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నామని, మరో 90 నుంచి 100 రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

వివరాలు 

ప్రయాణికుల సమస్యలను నిజాయితీగా, సాధ్యమైనంత వేగంగా పరిష్కరించడమే లక్ష్యం 

ఎయిర్‌సేవా పోర్టల్,మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడంతో పాటు వాటి పురోగతిని కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం వివిధ శాఖలు విడివిడిగా కాకుండా పీఏసీఆర్ అనే ఒకే వేదికపై సమన్వయంతో పనిచేస్తున్నాయని సిన్హా వివరించారు. ప్రయాణికుల సమస్యలను నిజాయితీగా, సాధ్యమైనంత వేగంగా పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. పీఏసీఆర్‌ను శాశ్వత వ్యవస్థగా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయడానికి ఇందులో ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకు సగటున 300 నుంచి 400 ఫిర్యాదులు వస్తుండగా, ఇటీవల పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిన సమయంలో రోజుకు 500కుపైగా ఫిర్యాదులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

Advertisement

వివరాలు 

ప్రయాణికుల ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 

శీతాకాలంలో పొగమంచు వంటి కారణాలతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు కూడా పీఏసీఆర్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, ఎయిర్‌సేవా పోర్టల్ ద్వారా ప్రయాణికుల ఫిర్యాదులను స్వీకరిస్తోంది. అత్యవసర సహాయం లేదా ఫిర్యాదుల నమోదు కోసం ప్రయాణికులు 011-24604283, 011-24632987 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement

వివరాలు 

సమర్థవంతంగా సేవలు

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటిగా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు దేశీయ విమాన సంస్థలు 5.75 కోట్లకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌సేవా పోర్టల్‌కు ఏఐ అప్‌గ్రేడ్ చేయడం వల్ల విమాన ప్రయాణికులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement