బెంగళూరులో ప్రొటోకాల్ ఉల్లంఘన.. గవర్నర్ని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించని ఎయిర్ ఏషియా
కర్ణాటక రాజధాని బెంగళూరులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహానగర పరిధిలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఈ మేరకు కన్నడ నాట గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ విమానం ఎక్కలేకపోయారు. ఫలితంగా ఫ్లైట్ బయల్దేరి వెళ్లిపోయింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గవర్నర్ విమానశ్రయానికి తరలివచ్చారు.హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని రాయచూర్ లో నిర్వహించనున్న ఓ కార్యక్రమానికి రోడ్డు మార్గాన వెళ్లాల్సి ఉంది. అప్పటికే ఆయన ఎక్కాల్సిన ఎయిర్ ఏషియా విమానంలోకి సిబ్బంది లగేజీని తరలించారు. గవర్నర్ విమానాశ్రయంలోని వీఐపీ టెర్మినల్- 2కు కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. ఫ్లైట్ షెడ్యూలుకు 15 నిమిషాల ముందు వీఐపీ లాంజ్ కు వచ్చిన ఆయన్ను విమానయాన సిబ్బంది ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించలేదు.
మరో విమానం కోసం 90 నిమిషాలు నిరీక్షించిన గవర్నర్
ఈ క్రమంలోనే ఏయిర్ ఏషియా విమానం టేక్ ఆఫ్ అయ్యింది. దీంతో విమానాశ్రయంలోని లాంజ్ లో మరో విమానం కోసం గవర్నర్ నిరీక్షించాల్సి వచ్చిందని రాజ్ భవన్ ప్రకటించింది. రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ పట్ల సదరు సంస్థ ప్రొటోకాల్ ఉల్లంఘించిందని ప్రోటోకాల్ అధికారులు వెల్లడించారు.ఈ మేరకు ఎయిర్‌పోర్టులోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు విమానాశ్రయ అధికారులను సంప్రదించగా, తాము ఎయిర్‌లైన్స్ సంబంధిత విషయాలపై స్పందించలేమని, పూర్తి వివరాల కోసం సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియానే అడగాలన్నారు. విషయం తెలుసుకున్న ఎయిర్ ఏషియా విచారం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వివరించింది. రాజ్ భవన్ తో మెరుగైన సంబంధాలకు అత్యంత విలువనిస్తామని పేర్కొంది.