
Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుండి ఢిల్లీ నుండి వాషింగ్టన్ వెళ్లే విమానాలు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ-వాషింగ్టన్ డీసీ మధ్య నాన్‌స్టాప్ విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిలిపివేత సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది అని తెలిపింది. ఆపరేషనల్ పరిమితుల కారణంగా ఈ మార్గంలో సేవలను నిలిపివేయాల్సి వచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దాదాపు 26 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు రిట్రోఫిటింగ్ చేస్తున్న నేపథ్యంలో విమానాల కొరత ఎదురవుతుందన్నారు. అలాగే పాకిస్థాన్ గగనతలం ఇంకా మూసివేత కొనసాగుతుండటం కూడా ఈ నిర్ణయానికి కారణమని ఎయిరిండియా స్పష్టం చేసింది. అందువల్ల విమానాల కొరత వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. గడచిన నెలలోనే 26 బోయింగ్ 787-8 విమానాలపై రిట్రోఫిటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు పేర్కొంది.
వివరాలు
2026 చివరి వరకు ఎప్పుడైనా కొన్ని విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చు
కస్టమర్ల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ విస్తృత కార్యక్రమం చేపట్టిన కారణంగా 2026 చివరి వరకు ఎప్పుడైనా కొన్ని విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చని వెల్లడించింది. అదేవిధంగా పాకిస్తాన్ గగనతలం మూసివేత కొనసాగుతుండటంతో విమానాల సుదూర కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని తెలిపింది. ఆపరేషనల్ సమస్యల కారణంగా ఈ విమానాల సేవలను నిలిపివేయడం తప్పనిసరి అయిందని పునరుద్ఘాటించింది. సెప్టెంబర్ 1 తర్వాత వాషింగ్టన్ డీసీకి లేదా అక్కడి నుంచి దిల్లీకి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను సంప్రదించి,వారి వ్యక్తిగత ఆర్ధిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇతర విమానాల్లో రీబుకింగ్ లేదా పూర్తి రిఫండ్ సహా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను అందిస్తామని ఎయిరిండియా తెలిపింది.