
Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. మూడు అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ 21 నుండి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా, మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించనున్నట్లు తెలిపింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ఏర్పడిన అనేక సాంకేతిక అంతరాయాల కారణంగా షెడ్యూళ్లలో స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యమని సంస్థ పేర్కొంది. అలాగే, ప్రయాణికులకు చివరి నిమిషంలో ఏర్పడే అసౌకర్యాన్ని తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. బోయింగ్ 787, బోయింగ్ 777 లాంటి వైడ్‌బాడీ విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నామని సంస్థ వెల్లడించింది.
వివరాలు
ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు
ఈ నేపథ్యంలో ఎయిరిండియా అంతర్జాతీయ వైడ్‌బాడీ సర్వీసులను సుమారుగా 15 శాతం మేర తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉండనున్నాయి. ఢిల్లీ-నైరోబి, అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో జూలై 15 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఢిల్లీ-నైరోబి రూట్‌లో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా,అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు చొప్పున విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. అలాగే.. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా,తూర్పు ఆసియాలోని నగరాలకు కలిపే 16 అంతర్జాతీయ రూట్లలో కూడా విమానా సర్వీసులను తగ్గించారు. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో,ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో,ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్లలో సర్వీసులను తగ్గించారు.
వివరాలు
ఈ మార్గాల్లో సర్వీసుల తగ్గింపు తాత్కాలికమే..
యూరప్‌లో ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమృత్‌సర్-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్‌హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్‌స్టర్‌డామ్ మార్గాల్లో కూడా విమానాల సర్వీసులను కుదించారు. అలాగే, ఢిల్లీ-మెల్‌బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా, ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) మార్గాల్లో కూడా సర్వీసులను తగ్గించారు. ఇదిలా ఉండగా,ఈ మార్గాల్లో సర్వీసుల తగ్గింపు తాత్కాలికమేనని స్పష్టం చేస్తూ, ఎయిరిండియా సీఈవో ప్రయాణికులకు స్పష్టతనిచ్చారు. విమాన భద్రతా ప్రమాణాలను మరింతగా పెంచడం, మధ్యప్రాచ్య దేశాల్లో గగనతల మార్గాల మూసివేత వంటివే ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఈ అసౌకర్యానికి విమానయాన సంస్థ తరఫున ఆయన ప్రయాణికులకు క్షమాపణలు కూడా తెలిపారు.