Air India: ఎయిర్ వర్థినెస్ లైసెన్సు లేకుండానే ఎనిమిది సార్లు ఎగిరిన ఎయిర్ ఇండియా ఏ320 విమానం.. డీజీసీఏ దర్యాప్తు
ఈ వార్తాకథనం ఏంటి
చెల్లుబాటు అయ్యే ఎయిర్‌వర్థినెస్ లైసెన్స్ లేకుండానే ఎయిర్ ఇండియా సంస్థ ఏ320 విమానాన్ని ఎనిమిది సార్లు నడిపినట్లు వెలుగులోకి రావడంతో తీవ్ర భద్రతా లోపం బయటపడింది. నవంబర్ 24,25 తేదీల్లో 164సీట్ల ఎయిర్‌బస్ ఏ320విమానం మొత్తం ఎనిమిది ప్రయాణాలు చేసిన తర్వాత, ఆ విమానానికి సంబంధించిన విమాన ప్రయాణం అనుమతి గడువు ముగిసిపోయిందని ఓ ఇంజనీర్ గుర్తించడంతో విషయం బయటకు వచ్చింది. దీనిపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. గతంలో జరిగిన డ్రీమ్‌లైనర్ ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల్లో భద్రతపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఈ ఘటన మరింత కలవరపెట్టింది. ఎయిర్‌వర్థినెస్ సర్టిఫికేట్‌ను డీజీసీఏ ప్రతి సంవత్సరం తనిఖీల తర్వాత ఇస్తుంది. ఆ అనుమతి లేకుండా విమానం నడపడం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా అధికారులు పేర్కొంటున్నారు.
వివరాలు
డీజీసీఏ అధికారులు దర్యాప్తు
ఈ ఘటనపై ఎయిర్ ఇండియాకు జరిమానాలు విధించడంతో పాటు,సంస్థలోని ఉన్నతాధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అవసరమైన లైసెన్స్ లేకుండా విమానాన్ని సర్వీస్‌కు అనుమతించిన వారందరినీ సస్పెండ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం సంబంధిత ఏ320 విమానాన్ని గ్రౌండింగ్ చేసి, మొత్తం వ్యవహారంపై డీజీసీఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గడువు ముగిసిన లైసెన్స్‌తో విమానం నడపడం వల్ల బీమా చెల్లుబాటు కూడా రద్దయ్యే అవకాశం ఉండడంతో లీజు సంస్థలతో సమస్యలు తలెత్తవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది ప్రయాణికుల భద్రతను తీవ్రంగా ప్రమాదంలో పడేసిందని, ఎయిర్ ఇండియా లాంటి ప్రధాన ఎయిర్‌లైన్ నుంచి ఇలాంటి ఉల్లంఘన ఆశించలేమని అధికారులు వ్యాఖ్యానించారు.
వివరాలు
'లెవెల్-1' నేరంగా పరిగణించే అవకాశం
సాధారణంగా లైసెన్స్ పునరుద్ధరణ పనులు మూడు నెలల ముందే ప్రారంభమవుతాయని, రోజువారీ సేవలు ముగిసిన తర్వాత రాత్రి తనిఖీల్లో అన్ని డాక్యుమెంట్లు చెక్ చేయాల్సి ఉండగా, ఇన్ని సార్లు లైసెన్స్ లేకుండానే విమానం ఎగరడం సంస్థ భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు పెడుతోందని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను విమాన భద్రతకు అత్యంత కీలకమైన 'లెవెల్-1' నేరంగా పరిగణించే అవకాశం ఉందని సమాచారం. గత కొంతకాలంగా ఇంజినీరింగ్ లోపాలపై షోకాజ్ నోటీసులు జారీ కావడం, నాణ్యత విభాగాధిపతిని సస్పెండ్ చేయడం వంటి ఘటనలతో ఎయిర్ ఇండియా మీద ప్రజల్లో నమ్మకం తగ్గిపోయింది.
వివరాలు
పదే పదే జరుగుతున్న లోపాలు ప్రయాణికుల్లో ఆందోళన
టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సహకారంతో వ్యవస్థలను పటిష్టం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, పదే పదే జరుగుతున్న లోపాలు ప్రయాణికుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఈ ఘటన తమకు బాధ కలిగించిందని ఎయిర్ ఇండియా తెలిపింది. దీనిపై పూర్తి స్థాయి అంతర్గత విచారణ చేపట్టామని, డీజీసీఏ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. భద్రతా నిబంధనల ఉల్లంఘనను తాము ఎప్పటికీ తీవ్రంగా పరిగణిస్తామని సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 32 సెకన్లకే కూలిపోయిన ఘటనలో 260 మంది మరణించగా, ఆ బాధిత కుటుంబాల్లో 95 శాతం మందికి మధ్యంతర నష్టపరిహారం చెల్లించినట్లు సంస్థ తెలియజేసింది.