Air India: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం: మే 31 వరకు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ అధికారికంగా ధృవీకరించారు. ముఖ్యంగా న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్‌కు నడుస్తున్న డైరెక్ట్ ఫ్లైట్‌లు పూర్తిగా రద్దయ్యాయి.
వివరాలు
ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న దాదాపు 40 వేల మంది భారతీయులు
ఈ నిర్ణయం వల్ల ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న దాదాపు 40 వేల మంది భారతీయులపై ప్రభావం పడనుంది. ఉద్యోగాలు, వ్యక్తిగత కారణాలతో అక్కడ పెద్ద సంఖ్యలో భారతీయులు ఉంటున్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా చాలామంది స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్న సమయంలో ఈ విమానాల రద్దు వారికి ఇబ్బందులను కలిగిస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు చెందిన ప్రధాన ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయెల్‌కు తమ సర్వీసులను నిలిపివేశాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని విమానయాన సంస్థలు మాత్రమే కఠిన భద్రతా నిబంధనల మధ్య పరిమితంగా విమానాలను నడుపుతున్నాయి.
వివరాలు
ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ-టెల్ అవివ్ మధ్య నేరుగా విమాన సర్వీసులు
గత జనవరి నెలలోనే ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ-టెల్ అవివ్ మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇందుకోసం అత్యాధునిక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలను వినియోగిస్తోంది. అయితే, తాజాగా యుద్ధం ప్రారంభం కావడంతో ఈ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, శనివారం ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్, రాయబార కార్యాలయ సిబ్బందితో కలిసి అక్కడ ఉన్న భారతీయులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.