
Air India: ఎయిర్ ఇండియా పైలట్లు, నాన్-ఫ్లయింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు భారీగా పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన పైలట్ల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు, అలాగే నాన్-ఫ్లైయింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఈ సంస్థలో పైలట్లు, నాన్-ఫ్లైయింగ్ సిబ్బంది ఇద్దరికీ పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. ఈ పెంపు నిర్ణయం గురించి ఇటీవల కంపెనీ నిర్వహించిన సమావేశంలో సీఈఓ,మేనేజింగ్ డైరెక్టర్ కాంప్‌బెల్ విల్సన్ వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అయితే, ఈ విషయంపై ఎయిర్ ఇండియా నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
వివరాలు
విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాలో వీలీనం
టాటా గ్రూప్ యాజమాన్యంలో కొనసాగుతున్న ఎయిర్ ఇండియాలో సుమారు 24 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 3,600 మంది పైలట్లు, 9,500 మంది క్యాబిన్ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే, క్యాబిన్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుంచి పెంచారా లేదా అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వాస్తవానికి, 2024 నవంబరులో టాటా గ్రూప్ కి చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాలో విలీనమైంది. ఆ విలీనానంతరం, ఎయిర్ ఇండియాలోని కొంతమంది పైలట్లు పదవీ విరమణ వయస్సులో ఉన్న తేడాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా నిర్ణయం ఈ విరుద్ధతలకు ముగింపు పలికే అవకాశముందని భావిస్తున్నారు.
వివరాలు
ఎయిర్ ఇండియాను వీడిపోయిన సిబ్బంది
ఇకపోతే, ఇటీవలకాలంలో చాలా మంది సిబ్బంది ఎయిర్ ఇండియాను వీడిపోయారు. కొంతమంది పైలట్లు, క్యాబిన్ సిబ్బంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ టౌన్ హాల్ సమావేశంలో మాట్లాడుతూ, పదవీ విరమణ వయస్సు పెంపు సిబ్బంది స్థిరత్వాన్ని కాపాడడమే కాకుండా, వారి అనుభవాన్ని సంస్థలో కొనసాగించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నట్లు సమాచారం.