Air quality: దిల్లీలో దారుణంగా క్షీణించిన గాలి నాణ్యత.. 'వెరీ పూర్' ఎయిర్ క్వాలిటీ
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. సోమవారం ఉదయం దానిని ప్రతిబింబించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 349 వద్ద నిలిచింది. దీనిని కాలుష్య నియంత్రణ మండలి 'వెరీ పూర్' కేటగిరీగా వర్గీకరించింది. వాయు కాలుష్యం కారణంగా నగరంపై పొగమంచు కమ్ముకోవడం వల్ల విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ విషమ పరిస్థితుల కారణంగా ఢిల్లీ ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలు, ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
దిల్లీలో వేగంగా పెరుగుతున్న వాయు కాలుష్యం
వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే బాణాసంచా తయారీ, వినియోగంపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, చల్లని వాతావరణంలో గాలి నాణ్యత క్షీణించడాన్ని అడ్డుకోవడం సవాలుగా మారింది. ప్రతేడాది శీతాకాలంలో దిల్లీలో వాయు కాలుష్యం సమస్య మరింత వేగంగా పెరుగుతోంది.