Ajit Doval France Visit: ఫ్రాన్స్‌లో అజిత్ దోవల్ పర్యటన.. రాఫెల్ డీల్‌పై కీలక చర్చలు
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇవాళ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాఫెల్ డీల్ ప్రధాన చర్చల అంశంగా ఉండనుంది. రక్షణ శాఖ అధికారుల ప్రకారం ఈ భేటీలో రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల దిల్లీలో జరిగిన చర్చల్లో ఫ్రాన్స్ నుంచి తుది ప్రతిపాదన అందుబాటులోకి రావడంతో రెండు దేశాల మధ్య దీనిపై మరింత స్పష్టత రావచ్చు. భారత ప్రభుత్వం ఇప్పటికే వాయుసేన కోసం డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను సేకరించేందుకు చర్చలు
ప్రస్తుతం నావికాదళం కోసం 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను సేకరించేందుకు చర్చలు జరుగుతున్నాయి. సముద్ర యుద్ధాల్లో ఈ విమానాలు అత్యుత్తమంగా పనిచేయాలని భారత రక్షణ శాఖ కోరుతోంది. ఈ సేకరణలో 22 సింగిల్-సీట్ విమానాలు, 4 ట్విన్-సీట్ ట్రైనర్ వెర్షన్‌లున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు ప్రస్తుతం భారత నావికాదళంలో సేవలో ఉన్న మిగ్-29లను భర్తీ చేయనున్నాయి. విమానాల కొరతను ఎదుర్కొంటున్న నావికాదళానికి, ఈ ఒప్పందం అవసరాలను తీర్చే విధంగా ఉంటుంది.
ఇరు దేశాల మధ్య కఠినమైన చర్చలు
ఇక 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, ఈ చర్చల్లో భారతదేశం తన సొంత విమాన తయారీ పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తుంది. 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు భారత నౌకాదళం అవసరాల కోసం ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకలు, వివిధ స్థావరాలపై మోహరించబడనున్నాయి. ఫ్రాన్స్‌లో దోవల్ పర్యటనకు ముందు, ఇరుదేశాల మధ్య కఠినమైన చర్చలు జరిగాయి. ఫ్రెంచ్ బృందం గత వారం దిల్లీలో భారత అధికారులతో కీలక చర్చలు జరిపి, ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది.