అధికార పక్షంలో అందుకే చేరా: ప్రధాని మోదీపై అజిత్ పవార్ ప్రశంసలు
ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఆదివారం అనూహ్యంగా అధికార ఏక్‌నాథ్ షిండ్- ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన అధికారంలో పక్షంలో ఎందుకు చేరారో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అజిత్ పవార్ ప్రశంసించారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం వల్ల తమ పార్టీ ఎమ్మెల్యేలు చాలా సంతోషంగా ఉన్నారని అజిత్ పవార్ చెప్పారు. తాము ఎన్సీపీ పార్టీగానే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామన్నారు. భవిష్యత్‌లోనూ ఎన్సీపీ పేరుతోనే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు.
మోదీ చేస్తున్న అభివృద్ధిలో భాగం కావాలనుకున్నాను: అజిత్
దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తాను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అలాగే శరద్ పవార్ కీలక పాత్ర పోషిస్తున్న ప్రతిపక్ష ఐక్యతను కూడా అజిత్ విమర్శించారు. ప్రతిపక్షాలు కలిసి రావడానికి ప్రయత్నిస్తున్నాయని, సమావేశాలు జరిగాయన్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరు పరిస్థితులు ఉన్నందున ఐక్యత అనేది అసాధ్యం అన్నారు. దేశ ప్రయోజనాల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతను తాను చూడలేదని, 1984నుంచి ఏ నాయకుడు కూడా దేశాన్ని ఒంటరిగా నడిపించలేదని అజిత్ అన్నారు. కానీ మోదీ గత తొమ్మిదేళ్లుగా ఒంటిచేత్తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. తాము మోదీ అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములం కావాలని అనుకుంటున్నట్లు చెప్పారు.