Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)'లో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాల్గొన్నారు. ఇరు పార్టీల మధ్య యూపీలో పొత్తు కుదిరిన నేపథ్యంలో భారత్ జోడో న్యాయ యాత్రలో తాము కూడా పాల్గొంటామని సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 17సీట్లను ఇవ్వనున్ననట్లు ఎస్పీ ప్రకటించింది. కాంగ్రెస్‌కు ఇచ్చే సీట్లలో మోదీ పోటీ చేసే వారణాసి కూడా ఉండటం విశేషం. రాహుల్ గాంధీ పర్యటనలో అఖిలేష్ యాదవ్ బల నిరూపణ కూడా కనిపించింది. పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యకర్తలు హాజరయ్యారు.
బీజేపీని తరిమికొట్టాలి: అఖిలేష్ యాదవ్
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రాహుల్ గాంధీ - అఖిలేష్ యాదవ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశంలో ప్రేమ గురించి మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికే తాము పోరాడుతున్నామన్నారు. బీజేపీని తరిమికొట్టి దేశాన్ని రక్షించాలన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోయినప్పుడే తమ పోరాటం సఫలీకృతమవుతుందన్నారు. ఈ సందర్భంగా వేదికపై రాహుల్‌తో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.