రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్
ఉత్తర్‌ప్రదేశ్ ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న ఐపీఎస్ అధికారి వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఆ అధికారిపై 'బుల్‌డోజర్' ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ వీడియో దర్యాప్తునకు ఆదేశించింది. ఐపీఎస్ అధికారి అనిరుధ్ సింగ్ ప్రస్తుతం వారణాసిలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అతను రూ.20 లక్షలు ఏర్పాటు చేయమని వీడియో కాల్‌లో ఒకరిని కోరినట్లు ఆ వీడియా ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వీడియో అనిరుధ్ సింగ్ మీరట్ జిల్లాలో పని చేస్తున్నప్పటిదిగా తేలింది. ఈ విషయంపై నివేదికను సమర్పించాల్సిందిగా పోలీసు కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
రెండేళ్ల క్రితం నాటి వీడియో: డీజీపీ
అఖిలేష్ యాదవ్ ట్వీట్‌పై మీరట్ పోలీసులు స్పందించారు. ఈ వీడియో 2 సంవత్సరాల క్రితం నాటిదని, ఈ వ్యవహారంపై విచారణ పూర్తయిందని పేర్కొన్నారు. మీరట్ జిల్లా రూరల్ ఎస్పీగా నియమితులైన ఐపీఎస్ అధికారి అనిరుధ్ సింగ్ వీడియో కాల్ ద్వారా ఒక వ్యక్తితో సంభాషిస్తున్న వీడియో వైరల్ అవుతోందని, ఇది రెండేళ్ల క్రితం నాటిదని చెప్పారు. ఈ వీడియోపై పోలీసులు విచారణ జరుపుతున్నారని డీపీడీ కార్యాలయం వెల్లడించింది. ఇదిలా ఉంటే, తన ఇంటి యజమానికి అద్దె చెల్లించలేదనే ఆరోపణల నేపథ్యంలో అనిరుధ్ సింగ్ భార్యపై పోలీసులు మరో విచారణ ప్రారంభించినట్లు పీటీఐ పేర్కోంది.