Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తన్న అలయ్-బలయ్.. ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడో తెలుసా
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అలయ్- బలయ్ సమ్మేళనం ఛైర్ పర్సన్ బండారు విజయ లక్ష్మి వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే తాము ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడే అలయ్ - బలయ్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా అలయ్ - బలయ్ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఏడాది ఆలయ్ - బలయ్ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ - బలయ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు విజయ లక్ష్మి పేర్కొన్నారు.
గత 17 ఏళ్లుగా అలయ్-బలాయ్ నిర్వహిస్తున్న బండారు దత్తత్రేయ ఫ్యామిలీ
ప్రజలందరిలో సోదర సోదరీభావం నెలకొనాలని గత 17 సంవత్సరాల నుంచి తాము అలయ్ - బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని బండారు విజయలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, రాజకీయ అతిరథులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవరత్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణతో పాటు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరి బాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డిలు హాజరుకానున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజకీయ ప్రముఖులు సైతం ఈ అలయ్ - బలయ్ కార్యక్రమానికి ముఖ్య, విశిష్ట అతిథులుగా విచ్చేస్తారని ఆమె వివరించారు.