Loading...
Cooking gas: వంటగ్యాస్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈకేవైసీ లేకుంటే సిలిండర్‌ కష్టమే!
వంటగ్యాస్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈకేవైసీ లేకుంటే సిలిండర్‌ కష్టమే!

Cooking gas: వంటగ్యాస్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈకేవైసీ లేకుంటే సిలిండర్‌ కష్టమే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

రాయితీపై గృహావసర వంటగ్యాస్‌ సిలిండర్లు పొందాలంటే ఇకపై బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి కానుంది. అక్టోబరు 1 నుంచి ఈకేవైసీ (e-KYC) పూర్తిచేసిన వినియోగదారులకు మాత్రమే రాయితీపై గృహావసర వంటగ్యాస్‌ సిలిండర్‌ అందించనున్నారు. ఈకేవైసీ చేయని వారికి రాయితీ సిలిండర్‌ ఇవ్వరు. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రాయితీపై వంటగ్యాస్‌ సిలిండర్లు అందేలా చూడటంతో పాటు, వాటిని వాణిజ్య అవసరాలకు మళ్లించకుండా నిరోధించేందుకు, నకిలీ గ్యాస్‌ కనెక్షన్లను తొలగించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 89.9 శాతం మంది వినియోగదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపింది.

వివరాలు

రాయితీపై గ్యాస్ సిలిండర్లు అందుతాయి

ఇప్పటికే ఈకేవైసీ పూర్తిచేసిన వినియోగదారులు మరోసారి ఆ ప్రక్రియను చేయాల్సిన అవసరం లేదు.

వారికి యథావిధిగా రాయితీపై గ్యాస్‌ సిలిండర్లు అందుతాయి.

అయితే ఇప్పటివరకు ఈకేవైసీ పూర్తిచేయని వారు మాత్రం ముందుగా ఆ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే రాయితీపై సిలిండర్‌ పొందగలరు.

వివరాలు

ఎక్కడ ఈకేవైసీ చేయించుకోవచ్చు?

వంటగ్యాస్‌ వినియోగదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు పలు మార్గాలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

డెలివరీ సిబ్బంది వద్ద: గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసే సిబ్బంది వద్ద ఉండే మొబైల్‌ యాప్‌ ద్వారా వేలిముద్ర లేదా ముఖ ఆధారిత గుర్తింపు(ఫేస్‌ ఆథెంటికేషన్‌)తో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

గ్యాస్‌ ఏజెన్సీ వద్ద: వినియోగదారులు తమకు సంబంధించిన గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లి ఈకేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు.

ఇంటివద్ద నుంచే: వినియోగదారులు ఇంటి నుంచే మొబైల్‌ యాప్‌ ద్వారా ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉంది.

ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులు ఇండియన్‌ ఆయిల్‌ వన్ యాప్‌ ద్వారా,భారత్‌ గ్యాస్‌ వినియోగదారులు హలో బీపీసీఎల్ యాప్‌ ద్వారా, హెచ్‌పీ గ్యాస్‌ వినియోగదారులు హెచ్‌పీ పే యాప్‌ ద్వారా పూర్తిచేసుకోవచ్చు.

ADVERTISEMENT