Indian Navy: హర్మూజ్‌లో నౌకలకు అలర్ట్.. మా అనుమతి తర్వాతే ప్రయాణించండి: ఇండియన్ నేవీ
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో ఇండియా జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో ఇండియన్ నేవీ అప్రమత్తమైంది. ఈ పరిణామాల మధ్య భారత పతాక నౌకలకు నేవీ ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సూచనల ప్రకారం నౌకలు లారక్ ద్వీపానికి దూరంగా ఉండాలని, నౌకాదళం నుంచి స్పష్టమైన అనుమతులు వచ్చిన తర్వాతే హర్మూజ్ జలసంధిలో ప్రయాణించాలనే ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఆ మార్గంలో ప్రయాణానికి ఎదురుచూస్తున్న నౌకల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లారక్ ద్వీపం హర్మూజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉండటం గమనార్హం.
వివరాలు
తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగశాఖ
యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు మొత్తం 11 నౌకలు ఈ కీలక జలమార్గాన్ని దాటాయి. వాటిలో చివరిగా 'దేశ్ గరిమ' అనే ట్యాంకర్ ఏప్రిల్ 18న ఈ మార్గం దాటింది. అదే రోజు 'జగ్ అర్ణవ్', 'సన్మార్ హెరాల్డ్' నౌకలు హర్మూజ్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా, ఇరాన్ బలగాలు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనను భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై వివరణ కోరుతూ భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో గతంలో భారత నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సహకరించిన విషయాన్ని కూడా భారత ప్రభుత్వం గుర్తు చేసింది.